కేంద్ర కార్మిక మంత్రి యాదవ్
న్యూఢిల్లీ : దేశంలో సాధ్యమైనంత త్వరగా సముచిత సమయంలో కొత్త లేబర్ కోడ్ నియమావళిని అమలు చేస్తారని కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ శుక్రవారం తెలిపారు. ఇప్పటికే దాదాపుగా అన్ని రాష్ట్రాలు నాలుగు లేబర్ కోడ్స్ ముసాయిదా నిబంధనలను రూపొందించాయి. వీటిని క్రోడీకరించుకుని రూపొందించే చట్టాల అమలుకు రంగం సిద్ధం అయిందని యాదవ్ వివరించారు. అన్ని రాష్ట్రాల వైఖరిని పరిగణనలోకి తీసుకుని ఖరారయ్యే చట్టాలను అమలులోకి తేవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అయితే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ ముసాయిదా నిబంధనలను రూపొందించే పనిలో ఉన్నాయని వివరించారు. నాలుగు లేబర్ కోడ్స్‌కు సంబంధించి కేంద్రప్రభుత్వం ఇప్పటికే ముసాయిదా నిబంధనలను రూపొందించింది. అయితే రాజ్యాంగం ప్రకారం లేబర్ వ్యవహారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పరిధిలోకి వస్తాయి. ఎటువంటి నిబంధనలను అయినా ఖచ్చితంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాల్సి ఉంటుంది.