Wednesday, January 22, 2025

3 బస్సులలో ఎమ్మెల్యేలతో రిసార్ట్‌లకు సోరెన్

- Advertisement -
- Advertisement -

Soren to resorts with MLAs in 3 buses

జార్ఖండ్‌లో బిజెపికి చిక్కరు దొరకరు

రాంచీ : జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం తీవ్ర ఉత్కంఠకు , రిసార్ట్ బసలకు దారితీసింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, అధికారంలో ఉన్న సంకీర్ణ పక్ష ఎమ్మెల్యేలు శనివారం మూడు బస్సులలో గుర్తు తెలియని ప్రాంతాలకు తరలివెళ్లారు. గనులలీజ్ వ్యవహారంతో సిఎం సోరెన్ శాసనసభ్యత్వంపై అనర్హత వేటు ఊగిసలాట దశలో ఉంది. గవర్నర్ తమపై అనర్హత వేటు వేస్తే ఎమ్మెల్యేలు బిజెపి ప్రలోభానికి గురి కాకుండా ఉండేందుకు సోరెన్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలను మూడు బస్సులలో తరలించారు. జెఎంఎం కాంగ్రెస్ ఆర్‌జెడి సంకీర్ణ ఎమ్మెల్యేలు సిఎం నివాసం ఇతర ప్రాంతాల నుంచి మూడు బస్సులలో బయలుదేరారు. ఈ బస్సులు చత్తీస్‌గఢ్ లేదా పశ్చిమ బెంగాల్‌కు వెళ్లినట్లు తేలింది. ఈ రెండు రాష్ట్రాలలో బిజెపియేతర ప్రభుత్వాలు అధికారంలో ఉండటంతో ఇక్కడి రిసార్ట్‌లను ఎంచుకుని సోరెన్ వారిని తరలించినట్లు స్పష్టం అయింది. బిజెపి ఎత్తుగడలను చిత్తు చేసేందుకు అర్థరాత్రి దాటిన తరువాత కూడా సిఎం నివాసంలో మంతనాలు జరిగాయి. ఎమ్మెల్యేలు అంతా కూర్చుని మాట్లాడుకున్నారు.

ఆ ఎమ్మెల్యేలు పెట్టెబేడాలతోనే సిఎం అధికార నివాసానికి తరలివచ్చినట్లు , బయట విలేకరులకు కూడా కనపడకుండా తెల్లవారుజామున బస్సులలో ప్రయాణం అయినట్లు వార్తాసంస్థలు తెలిపాయి. అయితే ఎమ్మెల్యేలు జార్ఖండ్ వీడి వెళ్లేది లేదని, ఇప్పుడు కేవలం సమీపంలోని కుంతి జిల్లాలోని లత్రాతూ వద్ద ఉన్న మూమెంట్ రిసార్ట్‌కు కేవలం పిక్నిక్‌కు వెళ్లినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి, సోరెన్ సన్నిహితుడు అలంగిర్ అలం తెలిపారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే దిశలో బిజెపి వ్యూహాలకు పాల్పడుతుందని భావించి ముందు జాగ్రత్త చర్యగా సోరెన్ తమ ఎమ్మెల్యేలను వేరే ప్రాంతాలకు తరలించారనే అంశంపై ఈ మంత్రి స్పందించలేదు. ఎమ్మెల్యేలు రాంచీలోనే ఉంటారని, వీరిని ఇతరులు ఎవరూ ప్రలోభపెట్టలేరని శుక్రవారం రాత్రి ఈ మంత్రి తెలిపారు. అయితే మరుసటి రోజు గుర్తు తెలియని ప్రాంతానికి మూడు బస్సులు వెళ్లినట్లు స్థానిక పత్రికలు తెలిపాయి. ఎమ్మెల్యేలు సాయంత్రం వరకూ పిక్నిక్‌కు వెళ్లి తిరిగివస్తారని రాష్ట్ర మంత్రి బన్నా గుప్తా కూడా తెలిపారు.

కొంచెం వినోదం కూడా ఉండాలి కదా అందుకే బయటకు వెళ్లుతున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ తెలిపారు. తాము పార్టీ ఆదేశాలను పాటించి ఏది చేయమంటే అది చేస్తామని కాంగ్రెస్‌కే చెందిన మరో ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అయితే ఎమ్మెల్యేలను చత్తీస్‌గఢ్ లేదా బెంగాల్‌లో రిసార్ట్‌లకు తీసుకువెళ్లుతున్నామని, ఇప్పటికే వారి కోసం నివాస ఏర్పాట్లు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సిఎం సోరెన్‌పై అనర్హత వేటు పడితే రాష్ట్ర రాజకీయాలలో కీలక మలుపు తలెత్తుతుంది. సిఎంపై అవిశ్వాసానికి బిజెపి సిద్ధపడుతుంది. లేదా సర్కారు వెంటనే కూలిపొయ్యేలా చేస్తుందని, ఈ దశలో ఎమ్మెల్యేలను బిజెపి నుంచి కాపాడుకునేందుకు సోరెన్ జాగ్రత్తలు చేపట్టారని వెల్లడైంది.

సోరెన్‌పై ఏ క్షణంలో అయినా గవర్నర్ వేటు ?

ముఖ్యమంత్రి శాసనసభ్యత్వంపై అనర్హత వేటును రాష్ట్ర గవర్నర్ రమేష్ బయాస్ శనివారం రాత్రి ఎప్పుడైనా ప్రకటిస్తారని ఉదయం నుంచి ప్రచారం జోరందుకుంది. అనర్హత వేటుకు సానుకూలంగా ఇప్పటికే ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. దీనిపై గవర్నర్ తన నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి పంపిస్తే ఇక అనర్హత అమలులోకి వస్తుంది. వెంటనే సోరెన్ ప్రభుత్వం కూలిపోదు కానీ అవిశ్వాస లేదా విశ్వాస తీర్మానాలకు అవకాశాలు ఏర్పడితే ఎమ్మెల్యేలతో బేరసారాల ప్రక్రియ జోరందుకుంటుంది. సాధ్యమైనంత త్వరగా గవర్నర్ తమ నిర్ణయం వెలువరిస్తారని రాజ్‌భవన్ అధికార వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర అసెంబ్లీలో బలాబలాలు

జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 81. ఇందులో అధికార సంకీర్ణ బలం 49….ఇందులో సోరెన్ నాయకత్వపు జెఎంఎం బలం అత్యధిక మెజార్టీపక్షంగా 30 మంది ఎమ్మెల్యేలతో ఉంది. కాంగ్రెస్ 18 మందితో, ఆర్జెడీ 1 సంఖ్యాబలంతో ఉంది. ప్రధాన ప్రతిపక్షం అయిన బిజెపి సభలో 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సంకీర్ణం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను లాగడం కష్టం కాకపోయినా ఇప్పటికిప్పుడు అసాధ్యం అని తేల్చుకుంటున్న బిజెపి రాష్ట్రంలో ఏదో విధంగా మధ్యంతర ఎన్నికలకు పావులు కదుపుతున్నట్లు వెల్లడైంది. ఈ లోగా క్యాంప్ రాజకీయాలతో అధికార పక్షంలో హడావిడి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News