కన్నూర్( కేరళ) భారత్‌లో హరిత విప్లవానికి ఆద్యుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న పురస్కారాన్ని ప్రకటించడం పట్ల ఆయన కుమార్తె డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ హర్షం వ్యక్తం చేశారు. తనకు లభించిన ఈ గౌరవానికి తన తండ్రి జీవించి ఉంటూ సంతోషించే వారని ఆమె అంటూ, అయితే ఆయన ఎప్పుడూ ఆవార్డుల కోసం పని చేయలేదన్నారు. తన తండ్రి చేసిన కృషిని అత్యున్తత పౌర పురస్కారంతో గుర్తించినందుకు తాను ఎంతో గర్వించడంతో పాటుగా సంతోషిస్తున్నానని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అయిన సౌమ్యా స్వామినాథన్ అన్నారు.
అయితే ఆయన పట్ల రైతులు చూసిన ప్రేమాభిమానాలే ఆయనకు ఎక్కువ ఇష్టమని ఆమె అన్నారు. ప్రభుత్వ నిర్ణయం తన తండ్రి కుటుంబ సభ్యులు, మిత్రులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులకు ఆనందాన్ని అందించడంతో పాటుగా సమాజ సంక్షేమం కోసం శాస్త్ర సాంకేతికలను ఉపయోగించవచ్చన్న బలమైన సందేశాన్ని ఈ దేశ యువతకు అందిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. తన తండ్రికి ఎన్నో అవార్డులు, గుర్తింపులు లభించాయని, అయితే వాటన్నిటికన్నా తాను క్షేత్రస్థాయిలో చేసిన పరిశోధనలు ఫలితాలనివ్వడం, ప్రజలు తన పట్ల చూపించే ప్రేమాభిమానాలే ఆయనకు ఎక్కువ స్ఫూర్తినిచ్చేవని డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు.