లక్నో: ఈద్, అక్షయ తృతీయతో సహా రాబోయే పండుగలకు ముందు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం ఒక ఆదేశాన్ని జారీ చేశారు. మతపరమైన కార్యక్రమాలలో మైక్రోఫోన్‌లను ఉపయోగించవచ్చు, అయితే ఆ శబ్దం ప్రాంగణం వెలుపల వినపడొద్దు, ఇతరులకు అసౌకర్యం కలిగించకూడదని చెప్పారు. శాంతిభద్రతలపై సమీక్షా సమావేశంలో, కొత్త ప్రదేశాలలో మైక్రోఫోన్‌లను ఉపయోగించకూడదని ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేషన్ను ఆదేశించారు. “….ప్రతి ఒక్కరికి వారి స్వంత మత సిద్ధాంతం ప్రకారం, వారి ఆరాధన విధానాన్ని ఆచరించే స్వేచ్ఛ ఉంది. మైక్రోఫోన్‌లను ఉపయోగించవచ్చు, కానీ మైక్రోఫోన్ శబ్దం ప్రాంగణం నుండి బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ఇతరులకు అసౌకర్యం కలిగించకూడదు. కొత్త ప్రదేశాల్లో మైక్రోఫోన్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతి ఇవ్వకూడదు” అని ఆదిత్యనాథ్‌ని ఉటంకిస్తూ ప్రభుత్వ ప్రకటనలో పేర్కొంది.
“ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, పోలీసులు మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. స్టేషన్ హౌస్ ఆఫీసర్ల (ఎస్‌హెచ్‌ఓ) నుండి ఎడిజి వరకు రాబోయే 24 గంటల్లో తమ ప్రాంతాల్లోని మత పెద్దలు, సమాజంలోని ఇతర ప్రముఖులతో మాట్లాడాలి” అని సిఎం అన్నారు. “అవాంతరం కలిగించే ప్రకటనలు” ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అడ్మినిస్ట్రేషన్ ను ఆదేశించారు.