ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందిన చిత్రం `సౌండ్ పార్టీ`. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించారు. జయ శంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది.
నటీనటులు ::
వి.జే సన్నీ, హ్రితిక శ్రీనివాస్, శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు తదితరులు.
టెక్నీషియన్స్ ::
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి ; ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; నిర్మాతలు : రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : జయశంకర్ ; రచన – దర్శకత్వం : సంజయ్ శేరి.
కథ ::
అమాయకులైన తండ్రీకొడుకుల మధ్య జరిగే ఫన్నీ డ్రామా ఇది. కష్టపడకుండా కోటీశ్వరులు అవుదామనుకుంటారు. తండ్రి కుబేర్ కుమార్ (శివన్నారాయణ), కొడుకు డాలర్ కుమార్ (వీజే సన్నీ) సౌండ్ పార్టీలు అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికోసం ఈజీగా డబ్బు సంపాదించాలని రకరకాల వ్యాపారాలు చేస్తారు. అయినా దేనిలోనూ సక్సెస్ కారు. ఇంటి నిండా అప్పులే మిగులుతాయి. అలాంటి టైంలో కుబేర్ కుమార్, డాలర్ కుమార్‌లకు ఓ ఆఫర్ వస్తుంది. ఎమ్మెల్యే వరప్రసాద్ (కమెడియన్ పృథ్వీ) కొడుకు చేసిన తప్పుని వీరిద్దరూ తమపై వేసుకుని జైలుకు వెళ్లేందుకు సిద్ధపడతారు. అలా చేస్తే రెండు కోట్లు వస్తాయి. ఆ రెండు కోట్ల కోసం కనీసం ఆ తప్పు ఏంటో కూడా తెలుసుకోకుండా చేయని తప్పుకు జైలుకి వెళ్తారు. తరువాత ఏం జరిగింది? చివరకు ఆ రెండు కోట్లు ఏమవుతాయి? తండ్రీకొడుకులు నిజంగానే సౌండ్ పార్టీలయ్యారా? అన్నది మిగతా కథ.
ఎవరు ఎలా చేశారంటే ::
ప్రధాన పాత్రలు పోషించిన సన్నీ, శివన్నారాయణ మధ్య ఫాదర్ అండ్ సన్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. సిరి పాత్రలో హ్రితిక క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. సెకండాఫ్ లో ఓ కీలక సన్నివేశంలో తానే ముందుండి నడిపిస్తుంది. సన్నీ తల్లి పాత్రలో ప్రియ నటించిన తీరు ఆకట్టుకుంటుంది. జైలర్ గా సప్తగిరి, ఎమ్మెల్యే వరప్రసాద్‌గా పృథ్వీ మెప్పించారు. శాస్త్రవేత్తగా అలీ ఒకటి రెండు సీన్లలో కనిపించినా.. తనదైన ఫన్నీ యాక్టింగ్ తో నవ్వు తెప్పించారు.
విశ్లేషణ ::
సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకునే సినిమా తీశారు దర్శక నిర్మాతలు. ఈజీగా డబ్బు సంపాదించడానికి తండ్రీకొడుకులు చేసిన ప్రయత్నాలతో ఫన్ జనరేట్ చేశారు. సెకండాఫ్ లోనూ ఆ నవ్వులు కంటిన్యూ అయ్యేలా చూసుకున్నారు. తండ్రీకొడుకులు జైలు నుంచి తప్పించుకునే సన్నివేశాలు, ఆర్ఆర్ఆర్ సినిమా స్పూఫ్, బిట్ కాయిన్స్ సీన్స్.. ఇలా అన్నీ నవ్విస్తాయి. మోహిత్ రెహమానిక్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోపాటు పూర్ణచారి రాసిన సాహిత్యం ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్ రెడ్డి అందించిన విజువల్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఎడిటర్ అవినాష్.. ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టించకుండా సినిమాకు న్యాయం చేశారు. ఫైనల్ గా క్లీన్ కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులకు ఈ చిత్రం థియేటర్స్ లో రీ సౌండ్ అని ఇస్తుందనే చెప్పాలి.
రేటింగ్ : 3.5