గంగూలి రేపు డిశ్చార్జి!
యాంజియో ప్లాస్టీ మరికొంతకాలం వాయిదా వేయాలని వైద్యుల నిర్ణయం
కోల్‌కతా: టీమిండియా మాజీ సారథి, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బుధవారం (6న) ఆయన ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. తొమ్మిది మంది సీనియర్ వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు సోమవారం సమావేశమై గంగూలి ఆరోగ్య పరిస్థితిపై చర్చించింది.ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో యాంజియోప్లాస్టీ వాయిదా వేయడమే సురక్షితమని బోర్డు సభ్యులు భావించినట్లు ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి ఎండి డాక్టర్ రూపాలి బసు తెలిపారు. ఈ బోర్డు సమావేశంలో ప్రఖ్యాత కార్డియాలజిస్టులు డాక్టర్ దేవి శెట్టి, కెఆర్ పాండ్య వర్చువల్ వేదికగా హాజరయ్యారని, అమెరికానుంచి మరో వైద్య నిపుణుడు కూడా ఫోన్‌లో పాల్గొన్నారని వెల్లడించారు. గంగూలికి యాంజియోప్లాప్టీ మరికొద్ది రోజులు లేదా వారాల్లో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. బుధవారం ఆయన డిశ్చార్జి అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. గంగూలికి చికిత్స అందిస్తున్న వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారని, డిశ్చార్జి అయిన తర్వాత కూడా ఆయన ఇంటివద్ద తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం డాక్టర్ దీపాశెట్టి గంగూలిని కలిసే అవకాశముందని, ఈ నేపథ్యంలో మరోసారి బోర్డు సమావేశమై దాదాపు తదుపరి అందించాల్సిన చికిత్సపై చర్చించనున్నట్లు రూపాలి బసు తెలిపారు.48 ఏళ్ల గంగూలి కి శనివారం మధ్యాహ్నం స్వల్ప గుండెపోటు రావడంతో ఆయనను కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్చారు. గుండె రక్త నాళాల్లో మూడు పూడికలు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు ఒక పూడికను తొలగించడం కోసం స్టెంట్ వేశారు. మిగతా రెండు పూడికలను తొలగించడం కోసం యాంజియోప్లాస్టీ చేయడంపై చర్చించిన వైద్యులు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నందున వాయిదా వేయడమే మేలనే నిర్ణయానికి వచ్చింది.
అనురాగ్ ఠాకూర్ పరామర్శ
ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గంగూలిని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకుని సాధారణ స్థితికి రావాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ దేశానికి దాదా ఓ హీరో అని అన్నారు.క్రికెట్‌లో అనేక ఒడిదొడుకులు చూశారని, అనేక సార్లు ప్రత్యర్థులను ఓడించారని అన్నారు. ఇప్పుడూ అదే చేస్త్తారన్నారు. తాను వెళ్లి కలిసినప్పుడు నవ్వాడని, బాగానే కనిపించారన్నారు. త్వరలోనే కోలుకుని సాధారణ స్థితికి చేరుకుంటారని, భారత క్రికెట్‌లో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు.
Sourav Ganguly Discharged from Hospital on Wednesday