Monday, December 23, 2024

సఫారీ చేతిలో టీమిండియా చిత్తు..

- Advertisement -
- Advertisement -

సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఆతిథ్య దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. బాక్సింగ్‌డే టెస్టు మూడు రోజుల్లోనే ముగియడం విశేషం. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 108.4 ఓవర్లలో 408 పరుగులకు ఆలౌటైంది. తర్వాత భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా ప్రత్యర్థి బౌలర్ల ధాటికి తట్టుకోలేక 34.1 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. 163 పరుగుల లోటుతో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. 8 బంతులను ఎదుర్కొన్న రోహిత్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఔటయ్యాడు. జైస్వాల్ ఐదు పరుగులు మాత్రమే చేశాడు. దీంతో భారత్ 13 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది.

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి తనపై వేసుకున్నాడు. అతనికి శుభ్‌మన్ గిల్ అండగా నిలిచాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. అయితే 37 బంతుల్లో ఆరు ఫోర్లతో 26 పరుగులు చేసిన శుభ్‌మన్‌ను మార్కొ జాన్సన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత భారత్ మళ్లీ కోలుకోలేక పోయింది. జట్టును ఆదుకుంటాడని భావించిన శ్రేయస్ అయ్యర్ ఆరు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో జట్టుకు అండగా నిలిచిన రాహుల్ ఈసారి నిరాశ పరిచాడు. రాహుల్ 4 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. రవిచంద్రన్ అశ్విన్ ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు. అతను సున్నాకే ఇంటిదారి పట్టాడు. శార్దూల్ ఠాకూర్ (0), బుమ్రా (0), సిరాజ్ (4) పరుగులు చేసి ఔటయ్యారు.

కోహ్లి ఒంటరి పోరాటం..
ఒకవైపు వికెట్లు పడుతున్నా స్టార్ ఆటగాడు కోహ్లి ఒంటరి పోరాటం చేశాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ ముందుకు సాగాడు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ కోహ్లి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ను ఆడాడు. అయితే అతనికి అండగా నిలిచే ఆటగాళ్లు లేకుండా పోయారు. అసాధారణ బ్యాటింగ్‌తో అలరించిన కోహ్లి 82 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 76 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 131 పరుగుల వద్దే ముగిసింది. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రి బర్గర్ నాలుగు, జాన్సన్ మూడు, రబడా మూడు వికెట్లు తీశారు.

అంతకుముందు 256/5 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం మూడో రోజు బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా 408 పరుగులకు ఆలౌటైంది. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన ఎల్గర్ 28 ఫోర్లతో 185 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్‌తో అలరించిన జాన్సన్ 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News