సత్తా చాటిన బౌలర్లు, మార్‌క్రామ్ మెరుపులు, రాణించిన డుసెన్, హెండ్రిక్స్, సౌతాఫ్రికా చేతిలో విండీస్ చిత్తు
దుబాయి: టి20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా తొలి విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన గ్రూప్1 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ విండీస్ ఈ టోర్నీలో వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో విండీస్ అవమానకర రీతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇక ఈ మయాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. టాపార్డర్ బ్యాట్స్‌మన్ నిలకడగా రాణించడంతో సఫారీ జట్టు అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ టెంబా బవుమా రెండు పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. దీంతో సౌతాఫ్రికా 4 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది.
ఆదుకున్న రీజా, డుసెన్
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను రీజా హెండ్రిక్స్, వండర్ డుసెన్ తమపై వేసుకున్నారు. ఇద్దరు విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేశారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చాలా సేపటి వరకు శ్రమించాల్సి వచ్చింది. డుసెన్ పూర్తి డిఫెన్స్‌కే పరిమితం కాగా, రీజా అడపాదడపా బౌండరీలతో అలరించాడు. అయితే 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 39 పరుగులు చేసి హెండ్రిక్స్‌ను అకిల్ హుస్సేన్ వెనక్కి పంపాడు. దీంతో 57 పరుగులు రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
మార్‌క్రామ్ జోరు..
తర్వాత క్రీజులోకి వచ్చిన ఐడెన్ మార్‌క్రామ్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. మరోవైపు డుసెన్ సమన్వయంతో ఆడుతూ అతనికి సహకారం అందించాడు. ఇక విండీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగిన మార్‌క్రామ్ భారీ షాట్లతో కనువిందు చేశాడు. అతన్ని కట్టడి చేసేందుకు విండీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన మార్క్ షాట్లతో అలరించిన మార్‌క్రామ్ భారీ సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన మార్‌క్రామ్ 26 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, రెండు బౌండరీలతో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన డుసెన్ మూడు ఫోర్లతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో సౌతాఫ్రికా మరో పది బంతులు మిగిలివుండగానే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బౌలర్లలోఅకిల్, బ్రావో మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశారు.
లూయిస్ దూకుడు..
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌కు ఓపెనర్లు ఎవిన్ లూయిస్, లిండల్ సిమన్స్ శుభారంభం అందించారు. సిమన్స్ సమన్వయంతో ఆడగా, లూయిస్ చెలరేగి బ్యాటింగ్ చేశాడు. ఆరంభం నుంచే సఫారీ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ ముందుకు సాగాడు. అతన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. లూయిస్ ధాటిగా ఆడితే సిమన్స్ మాత్రం డిఫెన్స్‌కే పరిమితం అయ్యాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన లూయిస్ కళ్లు చెదిరే సిక్సర్లతో అభిమానులను కనువిందు చేశాడు. ధాటిగా ఆడిన లూయిస్ 35 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, మరో మూడు బౌండరీలతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించాడు.
శుభారంభం వృథా..
కాగా, లూయిస్ విండీస్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. వికెట్ కీపర్ నికోలస్ పూరన్ (12), యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (12) జట్టును ఆదుకోవడంలో విఫలమయ్యారు. రసెల్ (5), హెట్‌మెయిర్ (1), వాల్ష్ (0) నిరాశ పరిచారు. కెప్టెన్ పొలార్డ్ ఒక సిక్స్, రెండు ఫోర్లతో 26 పరుగులు చేశాడు. బ్రావో ఒక బౌండరీతో 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో సౌతాఫ్రికా బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో విండీస్ స్కోరు 143 పరుగులకే పరిమితమైంది. ఇక 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టిన నోర్జేకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.