సౌతాఫ్రికా జట్టు ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన గ్రూప్‌బి చివరి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియా ఇంతకుముందే సెమీస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్‌ఎ నుంచి భారత్, న్యూజిలాండ్ టీమ్‌లు సెమీస్‌కు చేరుకున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 38.2 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్లు ఆరంభం నుంచే వరుస క్రమంలో వికెట్లను పడగొట్టారు. మార్కొ జాన్సన్ ప్రారంభంలోనే కీలకమైన మూడు వికెట్లను తీసి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టాడు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (8), బెన్ డకెట్ (24), వికెట్ కీపర్ జెమీ స్మిత్ (0)లను జాన్సన్ ఔట్ చేశాడు.
దీంతో ఇంగ్లండ్ 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జో రూట్, హ్యారి బ్రూక్ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కానీ హ్యారి బ్రూక్ (19)ను కేశవ్ మహారాజ్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఆ వెంటనే రూట్ (37) కూడా ఔటయ్యాడు. తర్వాత ఇంగ్లండ్ మళ్లీ కోలుకోలేక పోయింది. కెప్టెన్ జోస్ బట్లర్ (21), లివింగ్‌స్టోన్ (9) మరోసారి నిరాశ పరిచారు. జెమీ ఓవర్టన్ (11), జోఫ్రా ఆర్చర్ (25) పరుగులు చేసి ఔటయ్యారు. ఆదిల్ రషీద్ (2)ను ముల్డర్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 179 పరుగుల వద్దే ముగిసింది. సఫారీ బౌలర్లలో జాన్సన్, ముల్డర్ మూడేసి వికెట్లను పడగొట్టారు. మహారాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి.