Sunday, January 19, 2025

పాపం.. సౌతాఫ్రికా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలనే సౌతాఫ్రికా కల మరోసారి చెదిరి పోయింది. లీగ్ దశలో అసాధారణ ఆటతో ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా టీమ్ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో ఓటమి పాలైంది. లీగ్‌లో ఆస్ట్రేలియాను అలవోకగా ఓడించిన సఫారీ టీమ్ నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం ఆ సంప్రదాయాన్ని కొనసాగించలేక పోయింది. ఎప్పటిలాగే ఒత్తిడిని జయించలేక సెమీలోనే ఇంటిదారి పట్టింది. లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా సెమీస్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విజయాన్ని అందుకుంది.

ఈసారి ఎలాగైనా ఫైనల్‌కు చేరుకోవాలనే పట్టుదలతో సెమీస్ బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఒత్తిడిని జయించడంలో విఫలమైంది. లీగ్ దశలో పరుగుల వరద పారించిన క్వింటన్ డికాక్, వండర్ డుసెన్, మార్‌క్రమ్, జాన్సెన్ తదితరులు సెమీస్‌లో ఘోరంగా విఫలమయ్యారు. వరుస సెంచరీలతో ప్రపంచకప్‌లో పెను ప్రకంపనలు సృష్టించిన డికాక్ సెమీస్‌లో 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. కెప్టెన్ బవుమా అయితే ఖాతాను కూడా తెరువలేక పోయాడు. డుసెన్ ఆరు పరుగులే చేశాడు. మార్‌క్రమ్ కూడా పది పరుగులకే ఔటయ్యాడు. డేవిడ్ మిల్లర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.

ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మిల్లర్ శతకంతో అదరగొట్టాడు. మిగతా వారిలో క్లాసెన్ ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. బ్యాటర్ల వైఫల్యంతో సౌతాఫ్రికా 212 పరుగులకే కుప్పకూలింది. అయితే బౌలర్లు అసాధారణ పోరాట పటిమతో జట్టును గెలిపించేందుకు చివరివరకు ప్రయత్నించారు. బౌలర్లు సర్వం ఒడ్డి పోరాడడంతో ఒక దశలో సౌతాఫ్రికా గెలుపుపై ఆశలు చిగురించాయి. అయితే లక్షం పెద్దగా లేకపోవడంతో ఆస్ట్రేలియా విజయం సాధించడంలో సఫలమైంది. ఒకవేళ సౌతాఫ్రికా మరో 30 పరుగులు చేసి ఉంటే మాత్రం గెలుపు అవకాశాలు అధికంగా ఉండేవి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News