జోహెన్నస్‌బర్గ్: భారత్ గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌లో తామే విజేతగా నిలుస్తామని సౌతాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా జోస్యం చెప్పాడు. మెగా టోర్నీలలో వరుస పరాజయాలు చవిచూసే జట్టుగా తమపై ఉన్న అపవాదును ఈసారి చెరిపెస్తామని పేర్కొన్నాడు. ప్రపంచకప్ గెలువడమే లక్షంగా పెట్టుకున్నామని, దీని కోసం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ జట్టు సమతూకంగా ఉందన్నాడు. సుదీర్ఘ కాలంగా వన్డేల్లో ఆడుతున్నా తమ జట్టు ఒక్కసారిగా ప్రపంచకప్ ట్రోఫీ సాధించక పోవడం తమకు ఎంతో బాధకు గురిచేస్తుందన్నాడు. తనతో పాటు చాలా మంది క్రికెటర్లకు ఇది ఎంతో బాధించే అంశమేనన్నాడు.
అయితే ఈసారి మాత్రం వరల్డ్‌కప్ గెలిచేందుకు సర్వం ఒడ్డి పోరాడుతామన్నాడు. భారత్ పిచ్‌లపై ఆట ఆటగాళ్లకు మంచి అవగాహన ఉందన్నాడు. ఐపిఎల్‌లో ఆడడం వల్ల ఇది తమకు సానుకూలంగా మారుతుందన్నాడు. ఈసారి మెరుగైన ప్రదర్శనతో తమపై ఉన్న చోకర్స్ ముద్రను తొలగించుకుంటామనే ధీమాను రబడా వ్యక్తం చేశాడు. ఇదిలావుంటే 1992 నుంచి సౌతాఫ్రికా వన్డే వరల్డ్‌కప్‌లో పోటీ పడుతోంది. ప్రతిసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగే సౌతాఫ్రికా నాకౌట్ దశలో పరాజయం పాలై ఇంటిదారి పట్టడం అలవాటుగా మార్చుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లలో విజయం అంచుల దాకా వెళ్లి బోల్తా పడడం సౌతాఫ్రికాకు పరిపాటిగా తయారైంది. దీంతో సఫారీ జట్టుకు చోకర్స్ అనే పేరు సార్ధకం అయ్యంది.