Friday, November 15, 2024

ఇంగ్లండ్‌కు షాక్.. ఫైనల్లో సౌతాఫ్రికా

- Advertisement -
- Advertisement -

కేప్‌టౌన్: మహిళల టి20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం హోరాహోరీగా సాగిన రెండో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆరు పరుగుల తేడాతో అగ్రశ్రేణి టీమ్ ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించింది. ఈ క్రమంలో తొలిసారి ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లో తొలిసారి తుది పోరుకు చేరుకుని దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో సఫారీ టీమ్ తలపడుతుంది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఒక దశలో ఇంగ్లండ్ అలవోకగా గెలవడం ఖాయంగా కనిపించింది. కానీ కీలక సమయంలో సౌతాఫ్రికా బౌలర్లు అసాధారణ బౌలింగ్‌ను కనబరచడంతో ఇంగ్లండ్‌కు అనూహ్య ఓటమి తప్పలేదు.

స్పీడ్‌స్టర్ అయబొంగా ఖాకా అద్భుత బౌలింగ్‌తో సౌతాఫ్రికాకు చారిత్రక విజయం సాధించి పెట్టింది. చిరస్మరణీయ బౌలింగ్‌ను కనబరిచిన ఖాకా 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను పడగొట్టింది. మరో స్టార్ షబ్నమ్ ఇస్మాయిల్ కూడా మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించింది. ఇదిలావుంటే ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు డానిల్లె వ్యాట్, సోఫియా డంక్లే శుభారంభం అందించారు. ఇద్దరు తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన డంక్లె ఆరు ఫోర్లతో 28 పరుగులు చేసింది. వ్యాట్ కూడా ఆరు బౌండరీలతో 34 పరుగులు సాధించింది. షివర్ ఐదు ఫోర్లతో 40, కెప్టెన్ హీథర్ నైట్ రెండు సిక్సర్లతో 31 పరుగులు చేశారు. కానీ వీరిద్దరూ ఔటైన తర్వాత ఇంగ్లండ్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది.

లౌరా, బ్రిట్స్‌జోరు..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు లౌరా వల్‌వర్డ్, తజ్మిన్ బ్రిట్స్ అండగా నిలిచారు. వీరిద్దరూ ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన లౌరా ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 53 పరుగులు చేసింది. బ్రిట్స్ ఆరు బౌండరీలు, రెండు సిక్సర్లతో 68 పరుగులు సాధించింది. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. కాప్ 4 ఫోర్లతో అజేయంగా 27 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా స్కోరు 164 పరుగులకు చేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News