Monday, December 23, 2024

సౌతాఫ్రికాదే వన్డే సిరీస్

- Advertisement -
- Advertisement -

South Africa won 2nd ODI against India

 

పార్ల్: భారత్‌తో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విజయంతో దక్షిణాఫ్రికా మరో మ్యాచ్ మిగిలివుండగానే 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన సౌతాఫ్రికా 48.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు క్వింటన్ డికాక్, జానేమన్ మలాన్ శుభారంభం అందించారు. డికాక్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న డికాక్ స్కోరును పరిగెత్తించాడు. మలాన్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. దూకుడుగా ఆడిన డికాక్ 66 బంతుల్లోనే ఏడు ఫోర్లు, మరో 3 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 132 పరుగులు జోడించి జట్టును పటిష్టస్థితికి చేర్చాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ బవుమాతో కలిసి మలాన్ మరో కీలక పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన మలాన్ 8 ఫోర్లు, సిక్స్‌తో 91 పరుగులు చేసి ఔటయ్యాడు. బవుమా (35) తనవంతు పాత్ర పోషించాడు. ఆ తర్వాత మార్‌క్రామ్ 37 (నాటౌట్), డుసెన్ 37 (నాటౌట్) మరో వికెట్ నష్టపోకుండానే సౌతాఫ్రికాకు విజయం సాధించి పెట్టారు.

ఆదుకున్న రాహుల్, పంత్

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు రాహుల్, శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన ధావన్ ఐదు ఫోర్లతో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లి (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. కానీ రిషబ్ పంత్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 55 పరుగులు చేశాడు. ఇక దూకుడైన బ్యాటింగ్‌ను కనబరిచిన పంత్ పది ఫోర్లు, రెండు సిక్స్‌లతో 71 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. చివరల్లో శార్దూల్ 40 (నాటౌట్), అశ్విన్ 25 (నాటౌట్) రాణించడంతో టీమిండియా స్కోరు 287 పరుగులకు చేరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News