సెయింట్ విన్సెంట్: టి20 ప్రపంచకప్ గ్రూప్‌డిలో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఒక పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ ఓటమితో నేపాల్ సూపర్8 ఆశలకు తెరపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఓపెనర్ రిజా హెండ్రిక్స్ ఒక్కడే మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హెండ్రిక్స్ 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 పరుగులు సాధించాడు. మిగతా వారిలో ట్రిస్టన్ స్టబ్స్ (27) మెరుగ్గా రాణించాడు. డికాక్ (10), కెప్టెన్ మార్‌క్రమ్ (15)లు తప్ప మరే బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ మార్క్‌ను అందుకోలేక పోయారు. ప్రత్యర్థి టీమ్ బౌలర్లలో కుశాల్ 19 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను పడగొట్టాడు.
దీపేంద్ర సింగ్‌కు మూడు వికెట్లు లభించాయి. తర్వాత స్వల్ప లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ను కట్టడి చేయడంలో సఫారీ బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్ ఆసిఫ్ షేక్ రాణించినా ఫలితం లేకుండా పోయింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆసిఫ్ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో అనిల్ షా (27), కుశాల్ భుటెల్ (13) రెండంకెల స్కోరును అందుకున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రేస్ షంసి అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు.
అసాధారణ ప్రతిభను కనబరిచిన షంసి 19 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను పడగొట్టాడు. సఫారీ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో నేపాల్ లక్ష్యానికి ఒక పరుగు దూరంలో నిలిచి పోయింది. కాగా, గ్రూప్‌డిలో సౌతాఫ్రికా వరుసగా నాలుగో విజయం సాధించింది. ఇప్పటికే సౌతాఫ్రికా సూపర్8 బెర్త్‌ను దక్కించుకుంది. నేపాల్, శ్రీలంకలు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. మిగిలిన స్థానం కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది.