గెబెహరా: భారత్‌తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా సిరీస్‌ను 11తో సమం చేసింది. 212 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 42.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రీజా హెండ్రిక్స్ (52), టోనీ డి జోర్జి 119 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జోర్జి 9 ఫోర్లు, ఆరు సిక్సర్లతో అజేయంగా 119 పరుగులు చేశాడు. డుస్సెన్ (36) తనవంతు పాత్ర పోషించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రుతురాజ్ (4) విఫలమయ్యాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్‌వర్మ (10) కూడా నిరాశ పరిచాడు. అయితే సాయి సుదర్శన్, కెప్టెన్ రాహుల్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ఇద్దరు ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన సాయి సుదర్శన్ ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 62 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించిన రాహుల్ ఏడు బౌండరీలతో వేగంగా 56 పరుగులు చేశాడు. రింకు సింగ్ (17), సంజు శాంసన్ (12), అక్షర్ పటేల్ (7) విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో బర్గర్ మూడు, హెండ్రిక్స్, మహారాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.