Monday, November 18, 2024

సఫారీలకు హ్యాట్రిక్ విజయం

- Advertisement -
- Advertisement -

South Africa's victory over Bangladesh

చెలరేగిన రబడా, నోర్జే, రాణించిన బవుమా, బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా జయకేతనం

అబుదాబి: టి20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన గ్రూప్1 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా సెమీఫైనల్‌కు మరింత చేరువైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 13.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. సునాయాసమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. మూడు ఫోర్లతో 16 పరుగులు చేసిన డికాక్‌ను మెహదీ హసన్ అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటికే ఐడెన్ మార్‌క్రామ్ (౦) కూడా ఔటయ్యాడు. అతను ఖాతా తెరవకుండాన తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో సౌతాఫ్రికా 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆదుకున్న బవుమా

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ తెంబా బవుమా తనపై వేసుకున్నాడు. అతనికి వండర్ డుసెన్ అండగా నిలిచాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ ముందుకు సాగారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా రక్షణాత్మక పద్ధతిలో బ్యాటింగ్‌ను కొనసాగించారు. బంగ్లాదేశ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న డుసెన్ రెండు ఫోర్లతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పటికే నాలుగో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన బవుమా 28 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు మిల్లర్ అజేయంగా ఐదు పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా 13.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 86 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆరంభం నుంచే..

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ను ఆరంభించిన బంగ్లాదేశ్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ నయీం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అతన్ని రబడా వెనక్కి పంపాడు. ఆ వెంటనే వన్‌డౌన్‌లో వచ్చిన సౌమ్య సర్కార్ (0)ను కూడా రబడా ఔట్ చేశాడు. అతను సున్నాకే వెనుదిరిగాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన సీనియర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికుర్ రహీం కూడా నిరాశ పరిచాడు. అతను కూడా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అతన్ని కూడా రబడానే ఔట్ చేశాడు. మరోవైపు భారీ ఆశలు పెట్టుకున్న కెప్టెన్ మహ్మదుల్లా (3), అఫిఫ్ హుస్సేన్ (0)లు కూడా నిరాశ పరిచారు. దీంతో సౌతాఫ్రికా 34 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ లిటన్ దాస్ ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసి షంసి బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. ఇక బంగ్లా జట్టులో షమీమ్ (11), మెహదీ హసన్ (27) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. నలుగురు బ్యాట్స్‌మెన్ కనీసం ఖాతా కూడా తెరవలేక పోయారు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో రబడా, నోర్జే మూడేసి వికెట్లు పడగొట్టారు. షంసికి రెండు వికెట్లు దక్కాయి. కాగా ఈ వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. ఇక దక్షిణాఫ్రికాకు ఇది వరుసగా మూడో గెలుపు కావడం విశేషం. ఈ విజయంతో సౌతాఫ్రికా సెమీస్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News