మెగా టోర్నీలో 428 పరుగుల అత్యధిక స్కోర్ నమోదు
49 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన మార్‌క్రమ్
ఒకే ఇన్నింగ్స్‌లో మూడు శతకాలు
తొలి మ్యాచ్‌లో లంకపై ఘన విజయం
ప్రపంచకప్‌లో మూడు సార్లు 400 ప్లస్ పరుగులు సాధించిన ఏకైక జట్టు
న్యూఢిల్లీ : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా పలు రికార్డులను బద్దలు కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. ఈ క్రమంలో వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోరును సాధించిన జట్టుగా కొత్త రికార్డును నెలకొల్పింది. అంతేగాక వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా ఐడెన్ మార్‌క్రమ్ సరికొత్త రికార్డును బద్దలు కొట్టాడు.
మార్‌క్రమ్ 49 బంతుల్లోనే శతకం సాధించి వరల్డ్‌కప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. అంతేగాక క్వింటన్ డికాక్, వండర్ డుసెన్‌లు కూడా శతకాలతో చెలరేగారు. దీంతో ప్రపంచకప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు శతకాలు నమోదు చేసి మరో రికార్డును నెలకొల్పారు. ధాటిగా ఆడిన డికాక్ 84 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. డుసెన్ 13 ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 108 పరుగులు సాధించాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన మార్‌క్రమ్ 54 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. క్లాసెన్ (32), మిల్లర్ 39 (నాటౌట్)లు కూడా ధాటిగా ఆడడంతో సౌతాఫ్రికా స్కోరు 428 పరుగులకు చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌతాఫ్రికా 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.