Sunday, November 17, 2024

ఈసారైనా ఆ లోటు తీరుతుందా?

- Advertisement -
- Advertisement -

South africaTest fight that become crucial for Team India!

టీమిండియాకు కీలకంగా మారిన టెస్టు సమరం!

మన తెలంగాణ/క్రీడా విభాగం: కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా ఎదురులేని జట్టుగా మారిన విషయం తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా వరుస విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ తదితర విదేశీ సిరీస్‌లలో కూడా చారిత్రక విజయాలు సాధించింది. అయితే ఇన్ని విజయాలు సాధించిన టీమిండియాకు ఒక లోటు మాత్రం అలాగే మిగిలిపోయింది. అదే సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ విజయం. సుదీర్ఘ కాలంగా సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు అక్కడ ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ను గెలుచుకోలేక పోయింది. సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, సెహ్వాగ్, శ్రీనాథ్, జహీర్, కుంబ్లే, హర్భజన్, ధోని, గంగూలీ తదితరులు జట్టులో ఉన్నా కూడా సౌతాఫ్రికాను టెస్టుల్లో వారి సొంత గడ్డపై టీమిండియా ఓడించలేక పోయింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లలో కూడా భారత్ టెస్టు సిరీస్‌లను గెలిచింది. కానీ దక్షిణాఫ్రికాలో మాత్రం ఆ ఫీట్‌ను అందుకోలేక పోతోంది. ప్రతిసారి ఫేవరెట్‌గా సిరీస్ బరిలోకి దిగే టీమిండియా వట్టి చేతులతోనే స్వదేశానికి చేరుకోవడం అలవాటుగా మార్చుకుంది.

భారీ ఆశలతో..

ఇక ఈసారి కూడా టీమిండియా భారీ ఆశలతో సిరీస్‌కు సిద్ధమైంది. కోహ్లి సారథ్యంలోని టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే ఇటీవల కాలంలో టీమిండియాలో విభేదాలు తలెత్తడంతో దాని ప్రభావం జట్టుపై పడుతుందా అనుమానాలు నెలకొన్నాయి. ఇలాంటి స్థితిలో సౌతాఫ్రికా వంటి బలమైన జట్టును వారి గడ్డపై ఓడించడం కోహ్లి సేనకు తేలికేం కాదనే చెప్పాలి. కానీ వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంతో విరాట్ కసితో రగిలిపోతున్నాడు. ఈసారి సౌతాఫ్రికాపై టెస్టు సిరీస్ గెలిచి తానెంటో బిసిసిఐ పెద్దలతో చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. కానీ రోహిత్ శర్మ, జడేజా వంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో లేక పోవడం కోహ్లి సేనకు కాస్త ఇబ్బందికర అంశంగా మారింది. కానీ చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె, అశ్విన్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, రాహుల్, సాహా తదితరులతో టీమిండియా బలంగానే ఉంది. ఈ సిరీస్ పుజారా, రహానెలకు చావోరేవోగా మారింది. దీంతో వీరిద్దరూ ఈసారి మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. వీరిద్దరూ రాణించడంపైనే జట్టు గెలుపోటములు ఆధారపడి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

విరాట్‌కు చాలా కీలకం..

మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లికి సిరీస్ చాలా కీలకమని చెప్పాలి. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. ప్రతికూల పరిస్థితుల్లో జట్టును విజయపథంలో నడిపించడం కోహ్లికి అంత సులువుకాదు. అయితే పరిస్థితులకు ఎదురొడ్డి నిలువడంలో విరాట్‌కు ఎవరూ సాటిరారు. అతను ఈ సిరీస్‌ను ఒక సవాల్‌గా తీసుకున్నాడు. ఎలాగైనా జట్టును గెలిపించి సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. బౌలింగ్ విభాగం బలంగా ఉండడం అతనికి కలిసి వచ్చే అంశమే. ఇషాంత్,ఉమేశ్, సిరాజ్, శార్దూల్, అశ్విన్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. బ్యాటింగ్‌లోనూ బలంగా ఉండడంతో ఈసారి భారత్ ఎలాగైనా టెస్టు సిరీస్ గెలుస్తుందనే నమ్మకంతో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News