హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. రద్దీ నేపథ్యంలో విజయవాడ- టు చెన్నై మధ్య ఈ ప్రత్యేక రైలును నడపనున్నట్టుగా వారు వెల్లడించారు. రాయలసీమలో కొనసాగుతున్న వరదల నేపథ్యంలో విజయవాడ- టు చెన్నై మార్గంలో చిక్కుకున్న ప్రయాణీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు (07443)నడపనుంది.
విజయవాడ నుంచి బయలుదేరనున్న ఈ రైలు న్యూ గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరు పేటలో ఆగనుంది. ఈ స్పెషల్ రైలు రాత్రి 10:30కు చెన్నై చేరుకోనుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతోపాటు ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా బికనీర్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇది సాయంత్రం 07.35 గం.లకు బికనీర్ నుంచి బయలుదేరి ఉదయం 11 గం.లకు హైదరాబాద్ చేరుకుంటుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. అలాగే మంగళవారం నాడు నడిచే చెన్నై సెంట్రల్ – సిఎస్టీ ముంబై, చెన్నై సెంట్రల్ – ఎల్టిటి ముంబై, సిఎస్టి ముంబై – చెన్నై సెంట్రల్, ఎల్టిటి ముంబై, చెన్నై సెంట్రల్, బిలాస్పూర్, తిరునెల్వేలి రైళ్లతో పాటు బుధవారం బయలుదేరాల్సిన గోరఖ్పూర్ – సికింద్రాబాద్ రైలును రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.