Sunday, December 22, 2024

సంవత్సరాలుగా పెండింగ్‌లో దక్షిణ మధ్య రైల్వే ప్రాజెక్టులు !

- Advertisement -
- Advertisement -

అరకొర నిధులతో పూర్తికానీ వైనం
ప్రతి సంవత్సరం అంతకంతకు పెరుగుతున్న వ్యయం
అయినా కేటాయింపులు శూన్యం

మన తెలంగాణ/హైదరాబాద్:  సంవత్సరాల తరబడి దక్షిణమధ్య రైల్వేకు సంబంధించిన ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. గతంలో దక్షిణమధ్య రైల్వే రూపొందించిన అంచనాలు పెరగడంతో అంతకంతకు వాటి వ్యయం కూడా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో దక్షిణమధ్య రైల్వేకు మొండిచేయి చూపిస్తుండడంతో పాటు అరకొరగా నిధులను విధులిస్తూ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకుండా నిర్లక్షం వహిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ఎంపిలు పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సరుకు రవాణా, ప్రయాణికుల చేరవేతలో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్న దక్షిణమధ్య రైల్వేకు ప్రతిసారీ నిధుల కేటాయింపులో నిర్లక్షం చూపడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మునీరాబాద్- టు మహబూబ్‌నగర్ ప్రాజెక్టు

మునీరాబాద్- టు మహబూబ్‌నగర్ ప్రాజెక్టుకు ఈ సారి బడ్జెట్‌లో రూ. 345 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు 1997, -98 సంవత్సరంలో 244 కి.మీ.ల మేర పనులను చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం రూ. 1,723 కోట్లు అవుతుందని అంచనాలు రూపొందించారు. అయితే ఇందులో 68 కిలోమీటర్లు దక్షిణ మధ్య రైల్వే (తెలంగాణ రాష్ట్రం) పరిధిలోకి వస్తుండగా దానికి ఇప్పటివరకు రూ. 452 కోట్లు మంజూరయ్యింది.

నడికుడి టు -శ్రీకాళహస్తి కొత్త లైన్

నడికుడి టు -శ్రీకాళహస్తి కొత్త లైన్ ప్రాజెక్టుకు రూ. 202 కోట్లను మాత్రమే కేటాయించారు. ఈ ప్రాజెక్టు 2011,-12 సంవత్సరంలో రూ.2, 289 కోట్లతో 309 కిలోమీటర్ల మేర పనులు చేపట్టడానికి ఈ ప్రాజెక్టును మంజూరు చేశారు. ఇప్పటివరకు న్యూ పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం మధ్య 46 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పూర్తయ్యింది.

మనోహరాబాద్ టు -కొత్తపల్లి …

మనోహరాబాద్ టు -కొత్తపల్లి కొత్త లైన్ ప్రాజెక్టుకు రూ. 185 కోట్లు కేటాయించగా, ఈ ప్రాజెక్టు 2006-, 07 సంవత్సరంలో 151 కి.మీ.ల మేర పనులకు రూ. 1,160 కోట్లు అవుతుందని రైల్వే శాఖ అంచనాలు రూపొందించింది. మనోహరాబాద్- టు కొడకండ్ల నుంచి 44 కిలోమీటర్ల మేర మాత్రమే ఇప్పటి వరకు పూర్తయింది.

కోటిపల్లి- టు నర్సాపూర్ …

కోటిపల్లి- టు నర్సాపూర్ కొత్త లైన్ ప్రాజెక్టుకు రూ.100 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ ప్రాజెక్టు 2000-, 01 సంవత్సరంలో 57 కి.మీ.ల మేర పనులకు రూ. 2,120 కోట్లు అవుతుందని అంచనాలను రూపొందించారు. ఈ విభాగంలో కొత్త లైన్ పనులు గౌతమి, వైనతేయ, వశిష్ట నదులపై ముఖ్యమైన ప్రధాన వంతెనల నిర్మాణంలో ఉన్నాయి.

బీదర్ టు- నాందేడ్ 155 కి.మీలు

బీదర్ టు- నాందేడ్ కొత్త లైన్ ప్రాజెక్టుకు రూ. 100 కోట్లను కేటాయించగా, 2018, -19 సంవత్సరంలో 155 కి.మీ.ల మేర ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి రూ. 2152 కోట్లు అవుతుందని రైల్వే శాఖ పేర్కొంది.
2012,-13 సంవత్సరంలో భద్రాచలం టు- కొవ్వూరు
2012,-13 సంవత్సరంలో భద్రాచలం టు- కొవ్వూరు కొత్త లైన్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపగా ప్రస్తుతం ఈ బడ్జెట్‌లో రూ. 20 కోట్లను మాత్రమే కేటాయించారు. మొత్తం 151 కి.మీలకు రూ. 1,445 కోట్లు అవుతాయని అంచనా వేయగా వివిధ కారణాల వల్ల దానిని రూ. 2,154.83 కోట్లకు సవరించారు.

200 కి.మీలు మణుగూరు టు -రామగుండం…

200 కి.మీ.ల మేర మణుగూరు టు -రామగుండం కొత్త లైన్ ప్రాజెక్టుకు కేంద్రం 2013,-14 సంవత్సరంలో ఆమోదం తెలపగా దీనికోసం ఈ బడ్జెట్‌లో రూ.10 కోట్లను మాత్రమే కేటాయించారు. ఈ పనులకు మొత్తం రూ. 1,112 కోట్లు అవుతుందని మొదటగా అంచనాలు రూపొందించిన అధికారులు అనంతరం దానిని రూ. 2,911 కోట్లకు సవరించారు.

3వ లైన్ ప్రాజెక్టుకు రూ. 800 కోట్లు

విజయవాడ- టు గూడూరుల మధ్య 3వ లైన్ ప్రాజెక్టుకు రూ. 800 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ 3వ లైన్ ప్రాజెక్టు 2015-,16 సంవత్సరంలో 288 కిలోమీటర్ల మేర పనులకు రూ. 3549 కోట్లు అవుతుందని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం గూడూరు టు -బిట్రగుంట, కరవది- టు బిట్రగుంట, కృష్ణా కెనాల్ టు -కరవాడిల మధ్య మూడు దశల్లో పనులు ప్రారంభమయ్యాయి.

ఇప్పటివరకు 159 కిలోమీటర్లు మాత్రమే…..

గుంటూరు- టు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ. 980 కోట్లు కేటాయించగా ఈ ప్రాజెక్ట్‌కు 2016-, 17 సంవత్సరంలో కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తం 404 కి.మీల మేర పనులకు సంబంధించి రూ. 3,631 కోట్లు అవుతుందని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు 159 కిలోమీటర్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి.

2012, -13 సంవత్సరంలో కాజీపేట టు -విజయవాడ

కాజీపేట టు -విజయవాడ 3వ లైన్ ప్రాజెక్టుకు రూ.337.52 కోట్లు కేటాయించగా ఈ ప్రాజెక్టు 2012, -13 సంవత్సరంలో 220 కి.మీ.ల మేర పనులను చేపట్టాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. ఈ పనులకు రూ. 1,953 కోట్లు అవుతుందని కేంద్రం అంచనాలు రూపొందించింది. ప్రస్తుతం విజయవాడ -టు చెరువుమాధవ్రం విభాగాల మధ్య 19.2 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి.

కాజీపేట టు -బల్హర్షా 3వ లైన్ ప్రాజెక్ట్

కాజీపేట టు -బల్హర్షా 3వ లైన్ ప్రాజెక్ట్ (రాఘవపురం -మందమర్రి మినహా) కోసం రూ. 450.86 కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించారు. 2015-,16 సంవత్సరంలో 3వ లైన్ ప్రాజెక్టు ఇది మంజూరయ్యింది. ఈనేపథ్యంలో 201 కి.మీ.ల మేర పనులకు గాను రూ. 2,063 కోట్లు అవుతుందని అంచనాలను రూపొందించారు. ఇప్పటివరకు 50 కి.మీల పనులు పూర్తయ్యాయి.ఇలా పలు ప్రాజెక్టులు నత్తనడకన జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News