ఉత్తరాన బిజెపి ఎత్తుగడలు నెగ్గినాయి. దేశంలో కొన్ని లౌకిక పార్టీలు చీకటి లోకంలో మగ్గినాయి అన్న గజ్జెల మల్లారెడ్డి మాటలు మళ్ళీ గుర్తొస్తున్నాయి. తాము చేసే ప్రతీ పనిలో ఏదో ఒక మెలిక పెట్టడం బిజెపికి అలవాటే. ఆ మెలిక కూడా మామూలుగా ఉండదు, దాని ప్రభావం చాలా పెద్దగానే ఉంటుంది. తనకు మాత్రమే ప్రయోజనం చేకూరి, ఇతరులు ఇరుకున పడేసేలా బిజెపి చక్కటి వ్యూహంతో ఇరుకున పెడుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కూడా అదే పని చేసింది. ఆ బిల్లు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది కానీ అది అమలు అవ్వాలంటే మాత్రం కొన్ని మెలికలు ఉన్నాయి. అది జనాభా గణన, డీలిమిటేషన్. ఈ రెండింటిలో జనాభా గణన అంశాన్ని పక్కనపెడితే డీలిమిటేషన్ ప్రక్రియ మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
పార్లమెంటరీ లేదా అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్మించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు.
జనాభా ప్రాతిపదికన ప్రజాప్రతినిధులు ఉండేలా సీట్లు కేటాయించాలన్న ఆలోచనతో ఈ డీలిమిటేషన్‌ని తెరమీదకు తీసుకొచ్చారు. అంటే పార్లమెంట్ లేదా రాష్ర్ట శాసనసభలో, ప్రతి ప్రతినిధి సభలో సమాన సంఖ్య లో జనాభాకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. అయితే ఈ డీలిమిటేషన్ ప్రక్రియని అమలు చేయాలంటే ముందుగా రాజ్యాంగం ప్రకారం జనాభా గణన చేయాల్సి ఉంటుంది. నిజానికి 2021లో జనాభా గణన జరగాల్సి ఉంది. కానీ అప్పుడు కొవిడ్ మహమ్మారి కారణంగా అది జరగలేదు. మరో విషయం ఏమిటంటే మోడీ ప్రభుత్వం ఇంతవరకూ జనాభా గణన ప్రారంభించలేదు.
ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా రేటు చాలా తక్కువ. ఉత్తరాదిన జనాభా గణనీయంగా పెరిగిపోతుంటే దక్షిణాదిలో మాత్రం జనాభా నియంత్రణపై కేంద్రం నిబంధనల్ని పాటిస్తున్నారు. అందుకే జనాభా పెరుగుదల దక్షిణాది రాష్ట్రాల్లో ఒక క్రమంలో ఉంది. మొత్తంగా చెప్పాలంటే దక్షిణాది కన్నా ఉత్తరాది జనాభా ఎక్కువ. ఇలాంటప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఉత్తరాది రాష్ట్రాలకే ప్రయోజనం చేకూరుస్తుంది. జనాభా ప్రాతిపదికన సీట్లు ఉండాలన్నది నియమం కాబట్టి ఉత్తరాదిన జనాభా ఎక్కువగా ఉండటంతో అక్కడ సీట్లు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉండటంతో, ఉన్న సీట్లలో కోతపడే ప్రమాదం ఉంది.
రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కింపు తర్వాత కేంద్రం ఖచ్చితంగా చేయాల్సిన పనుల్లో నియోజకవర్గాల పునర్విభజన ఒకటి. జనాభా ప్రాతిపదికన దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నియోజకవర్గాలను విభజించి, సరిహద్దులు గుర్తిస్తారు. అలాగే ఏయే నియోజకవర్గాలకు ఎస్‌సి, ఎస్‌టి ప్రాతినిధ్యం అవసరం ఉందనే లెక్కలు కూడా తేలుస్తారు. పార్లమెంట్ చట్టం ప్రకారం కేంద్రం ఒక డీలిమిటేషన్ కమిషన్‌ని ఏర్పాటు చేస్తుంది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఈ కమిటీకి చైర్మన్‌గా ఉంటారు. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో పాటు అన్ని రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ ఇందులో సభ్యులుగా ఉంటారు. 1952లో తొలి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది.
1951 జనాభా లెక్కల ప్రకారం 36 కోట్ల 10 లక్షల జనాభాకు 494 లోక్‌సభ స్థానాలను గుర్తించారు. 1963లో రెండో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. 1961 జనాభా లెక్కల ప్రకారం 43 కోట్ల 90 లక్షల జనాభాకు లోక్‌సభ స్థానాల సంఖ్యను 522కు పెంచారు.అలాగే 1973లో 54 కోట్ల 80 లక్షల జనాభాకు గాను ఆ సంఖ్యను 543 కు పెంచారు. ఆ తరువాత 2002 కూడా మరోసారి నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 2001 జనాభా లెక్కల ప్రాతిపదికన కాకుండా 1973 నాటి జనాభా లెక్కల ప్రకారమే లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచకుండా, తగ్గించకుండా 543 స్థానాలనే కొనసాగించారు. అంతేకాదు మరో 25 ఏళ్ల వరకు అంటే 2026 వరకు డీలిమిటేషన్ ప్రక్రియను చేయరాదని 84వ సవరణ ద్వారా పార్లమెంట్‌లో ఒక చట్టం చేశారు.
దక్షిణాదిలో జరిగిందేమిటి?
1952లో అప్పటి భారత ప్రభుత్వం జనాభా పెరుగుదలను అదుపులో పెట్టడం కోసం ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రాంను తెరపైకి తీసుకొచ్చింది.1976 తర్వాత ఈ కార్యక్రమం ఉధృతంగా కొనసాగింది. కేంద్రం ఆదేశాల ప్రకారమే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను అమలు చేయడంలో చాలా చురుకుగా వ్యవహరించాయి.జనాభా పెరగకుండా చూసుకోవడంలో విజయం సాధించాయి. దీంతో ఉత్తరాది రాష్ట్రాల జనాభాతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల జనాభా పెరుగుదల చాలా వరకు తగ్గింది. కానీ దక్షిణాది రాష్ట్రాలు సాధించిన ఈ విజయమే ఇప్పుడు తమ పాలిట శాపమైంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన జరగనుండటంతో ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్‌సభ స్థానాలు పెరుగుతాయి. తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు లోక్ సభ స్థానాల సంఖ్య తగ్గుతుంది.
ఇది కేవలం లోక్‌సభలోనే కాదు రాజ్యసభలో రాష్ట్రాలకు కేటాయించే రాజ్యసభ సభ్యుల సంఖ్యపై కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. దీంతో భవిష్యత్‌లో పార్లమెంట్‌లో అన్ని రకాలుగా తమ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. దీని వల్ల పార్లమెంట్‌లో తమ డిమాండ్లను వినిపించే అవకాశాలు, హక్కులతో పాటు కేంద్రం ఇచ్చే నిధులను కూడా కోల్పోతుంది.ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా అందులో దక్షిణాది రాష్ట్రాల నుండి 129 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. అంటే మొత్తం సంఖ్యలో ఇది కేవలం 24 శాతం మాత్రమే. వాటిలో తెలంగాణ నుండి 17, ఎపి నుండి 25, కేరళ నుండి 20, తమిళనాడు నుండి 39, కర్ణాటక నుండి 28 స్థానాలు ఉన్నాయి. 1951, 1961, 1971 జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ స్థానాలు పెరిగిన తీరు చూస్తే ఇప్పుడున్న జనాభా ప్రకారం ప్రతీ 20 లక్షల మందికి ఒక లోక్‌సభ స్థానం ప్రకారం విభజించే అవకాశం ఉంది.
అలా చూసుకుంటే మొత్తం లోక్‌సభ స్థానాలు 543 నుండి 753 కు పెరుగుతాయి. అప్పుడు తెలంగాణకు 3 స్థానాలు పెరిగి 20, ఆంధ్రప్రదేశ్‌కు 3 స్థానాలు పెరిగి 28, తమిళనాడుకు 2 స్థానాలు పెరిగి 41, కర్ణాటకకు 8 స్థానాలు పెరిగి 36 స్థానాలు ఉండగా కేరళకు 1 స్థానం తగ్గి 19 స్థానాలు ఉండనున్నాయి. పెరగబోయే మొత్తం 753 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా కేవలం 144 మాత్రమే ఉంటుంది. అంటే మొత్తం పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల వాటా ఇప్పటి వరకు ఉన్న 24 శాతం నుండి 19 శాతానికి తగ్గుతుంది. ఇప్పటికే 80 లోక్‌సభ స్థానాలతో ఉత్తరప్రదేశ్ ఎక్కువ స్థానాలు ఉన్న రాష్ర్టంగా నెంబర్‌వన్ స్థానంలో ఉంది. అందుకే కేంద్రం లో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా యుపిలో విజయం ఎంతో ముఖ్యం.
2026 డీలిమిటేషన్ తరువాత యుపిలో లోక్‌సభ స్థానాల సంఖ్య 80 నుండి 128కి పెరిగే అవకాశం ఉంది. అదే కానీ జరిగితే ఈ నియోజకవర్గాల పునర్విభజనతో ఎక్కువ లాభం పొందే రాష్ర్టం యుపి అవుతుంది. ఇక ప్రస్తుతం యుపిలో ఎక్కువగా ఏ పార్టీ హవా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆ తరువాత ఎక్కువ లాభం పొందే రాష్ట్రాల్లో బీహార్ ఉంటుంది. యుపి తరువాత ఎక్కువ జనాభా ఉన్న బీహార్ లో ఇప్పుడున్న లోక్‌సభ స్థానాల సంఖ్య 40 నుండి 70కి పెరిగే అవకాశం ఉంది. మహారాష్ర్టలో ఇప్పుడున్న 48 లోక్‌సభ స్థానాల నుండి 68కి పెరిగే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పుడున్న 29 స్థానాల నుండి 47కు పెరిగే అవకాశం ఉంది.
అలాగే రాజస్థాన్‌లో 25 స్థానాల నుండి 44 స్థానాలకు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ అంచనాల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం భారీగా తగ్గిపోనుండగా ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం భారీగా పెరిగిపోనుంది. అంటే దక్షిణాది రాష్ట్రాలు భయపడుతున్నట్టు ఇక్కడి ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండానే ఉత్తరాది సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు.బిజెపి వాదన ప్రకారం సీట్లు పెరుగుతాయన్నది నిజమే. కానీ ఇదే సమయంలో ఉత్తరాదికి ఎన్ని సీట్లు పెరుగుతున్నాయో చెప్పడం లేదు. ఎందుకంటే ఉత్తరాదికి పెరిగే సీట్లతో పోల్చితే దక్షిణాదిన పెరిగే సీట్ల శాతం చాలా చాలా తక్కువ. ఒక్కముక్కలో చెప్పాలంటే దక్షిణాది ఎంపి సీట్లు అక్కర్లేకుండానే ఉత్తరాదిన గెలిచే సీట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అలాంటప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యతా ఉండకపోవచ్చు.
పైగా నియోజకవర్గాల సంఖ్యను బట్టే నిధులు విడుదలవుతాయి. దక్షిణాదికి వచ్చే నిధుల్లోనూ భారీ కోత పడొచ్చు. అంతిమంగా తాజా జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే మాత్రం దక్షిణాదికి అన్ని విషయాల్లో మొండిచెయ్యే అనేది రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకుల మాట. అయితే ఈ డీలిమిటేషన్‌పై దక్షిణాదిన పెద్ద చర్చే జరుగుతోంది. కాకపోతే ఒక్క తమిళనాడు మినహా ఏ రాష్ర్టం కూడా దీనిపై సీరియస్‌గా పోరాడాలని అనుకోవడం లేదు. కాబట్టి చైతన్యపూరితమైన చరిత్ర కలిగిన దక్షిణాది రాష్ట్రాలు ఇకనైనా ఈ అంశంపై ఐక్యంగా పోరాడితే తప్ప అన్ని రంగాల్లో కేంద్ర నుండి రావాల్సిన వాటాలు దక్కవు.
– నాదెండ్ల శ్రీనివాస్- 9676407140