Saturday, January 18, 2025

దక్షిణాదిపై ఆర్థిక వివక్ష?

- Advertisement -
- Advertisement -

దక్షిణ రాష్ట్రాల నిధులు, ఉత్తర రాష్ట్రాల నిధులనే అంశాన్ని పురస్కరించుకొని దేశంలో వున్నట్లుండి ఒక ముఖ్యమైన చర్చ మొదలైంది. దక్షిణాది అభివృద్ధి, సంపదలు, పన్నుల వసూళ్ళు ఉత్తరాది కన్నా ఎక్కువ కాగా, వాటిని వెనుకబడిన ఉత్తరాది రాష్ట్రాలకు మళ్ళిస్తున్నారని, కేంద్ర నిధుల కేటాయింపులో దక్షిణాది పట్ల వివక్ష చూపుతున్నారనేది ఈ చర్చలోని ప్రధానాంశం. నిజానికి ఈ ఫిర్యాదు కొంత కాలం నుంచి వున్నా, దీనిని అజెండా చేసుకొంటూ కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేరళ ముఖ్యమంత్రి విజయన్ స్వయంగా ఢిల్లీలో గత కొద్ది రోజుల క్రితం నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, తమిళనాడు ప్రభుత్వం అదే విషయమై గొంతెత్తడం, ఆప్ ప్రభుత్వం సంఘీభావం తెలపడం దీన్నంతటినీ ప్రధాని మోడీ పార్లమెంటులో విమర్శించడంతో ఈ అంశానికి సరికొత్త ప్రాధాన్యం ఏర్పడింది. తాము అధికారంలో వున్నప్పుడు బిఆర్‌ఎస్ ఈ వివక్షను పదే పదే ఎత్తి చూపుతుండటం తెలిసిందే.

ఉత్తరాది కన్నా దక్షిణ రాష్ట్రాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయన్నది స్వయంగా కేంద్ర సంస్థలతో పాటు అనేక స్వతంత్ర అధ్యయనాలు ఎప్పటి నుంచో చెప్తున్న విషయం. ఈ స్థితికి కారణాలు ఉత్తర రాష్ట్రాల కన్నా దక్షిణ రాష్ట్రాల పాలన సమర్థవంతంగా సాగడం. శాంతి భద్రతలు మెరుగుగా వుండి అభివృద్ధికి సానుకూల వాతావరణం ఏర్పడటం. సామాజిక సంక్షేమ రంగంలో ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు. మంచి అభివృద్ధి మూలంగా ఆర్థిక రంగం స్థిరంగా వుండి పన్నుల వసూళ్ళు గణనీయంగా పెరుగుతుండటం. విద్య, వైద్య పురోగమనాలు, మౌలిక సదుపాయాల విస్తరణలు. ప్రజల చైతన్యం మూలంగా జనాభా పెరుగుదల నియంత్రణలో ఉండటం. ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తరాది పరిస్థితులు మొత్తంగానే ఇందుకు విరుద్ధం. అందువల్లనే గతంలో కేంద్ర ప్రణాళికా సంఘం ‘బిమారూ’ (వ్యాధిగ్రస్థ) రాష్ట్రాలుగా ప్రకటించినవన్నీ ఉత్తరాదివే అయ్యాయి. ఆ పరిస్థితి కొన్ని దశాబ్దాలు గడిచినా మారలేదు.

గమనించవలసిందేమంటే వెనుకబడిన రాష్ట్రాలను ఆదుకోవాలనే పేరిట కేంద్రం ఈ దశాబ్దాల పొడవునా పెద్ద ఎత్తున అదనపు నిధులు కేటాయిస్తున్నా, దక్షిణాది నుంచి పన్నుల ఆదాయం మళ్ళిస్తున్నా, దక్షిణ రాష్ట్రాలకు కేంద్ర నిధులను అక్కడి అభివృద్ధి నత్తనడకనే సాగుతున్నది.ఇందుకు కారణం పైన అనుకొన్నట్లు ఎడతెగని అసమర్థ పాలన. ఒక దేశంలోని వెనుకబడిన రాష్ట్రాలను ముందుకు తెచ్చేందుకు అభివృద్ధి చెందిన రాష్ట్రాల నుంచి కొన్ని నిధులను మళ్ళించడం అవసరమనే సూత్రీకరణలో యథాతథంగా ఆక్షేపించవలసిందేమీ లేదు. కనుకనే ఈ మళ్ళింపులకు దక్షిణ రాష్ట్రాలు చాలా కాలం మౌనంగా అంగీకారం తెలిపాయి. కాని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమర్థవంతమైన పాలనతో ముందడుగు వేసేందుకు బదులు ఉత్తరదేశం అదే ఊబిలో కొనసాగుతూ వస్తున్నది. కనీసం కేంద్రమైనా గత కాంగ్రెస్ పాలనలో గాని, తర్వాత బిజెపి హయాంలో గాని పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమయ్యాయి.

అందువల్ల దక్షిణాది రాష్ట్రాలపై భారం ఒక అంతులేని కథగా మారింది. తాము సమర్థవంతంగా పాలించుకొని అభివృద్ధి చెందుతున్నందుకు “ఈ శిక్షను” ఇంకా ఎంత కాలం అనుభవించాలి? అసలు ఎందుకు అనుభవించాలి? అన్న ప్రశ్నలు దక్షిణాదిన కొంత కాలం క్రితం వరకు మందకొడిగా ఉండి, ఇటీవల ఉచ్ఛ స్వరంలో వినవస్తున్నాయి. గతంలో తెలంగాణ, తమిళనాడు, కేరళ పలు మార్లు ఈ అంశం లేవనెత్తాయి. నిధుల మళ్ళింపు ఒకటి కాగా, కేంద్ర నిధులలో కోత రెండవది. ఒక దశలోనైతే తమిళనాడు, దక్షిణ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ఏర్పాటు చేసి, దక్షిణాది యూనియన్ స్థాపనకు ప్రయత్నించింది. ఇటీవల కర్నాటకలో కాంగ్రెస్ అధికారానికి రావడంతో వారు కూడా ఈ వాదనలతో స్వరం కలుపుతున్నారు. తెలంగాణలో కొత్తగా గెలిచిన కాంగ్రెస్ కూడా ముందుకు రాగలదేమో చూడాలి.ఢిల్లీలో నిరసన కార్యక్రమాల సందర్భంగా సిద్దరామయ్య, విజయన్‌లు మాట్లాడుతూ, తాము ఉత్తర, దక్షిణ దేశాల మధ్య విభేదాలు సృష్టించేందుకు గాని, విభజనకు గాని ప్రయత్నించడం లేదని, తమ పట్ల వివక్ష చూపవద్దని మాత్రమే కోరుతున్నామని స్పష్టం చేశారు.

అయితే, ముఖ్యమంత్రి స్థాయి వారు తమ రాష్ట్రాలలో ఉండి ఈ మేరకు ప్రకటనలు చేయడానికి, స్వయంగా దేశ రాజధానికి వెళ్ళి జంతర్‌మంతర్ వంటి నిరసనల కేంద్రం వద్ద ఆందోళన చేయడానికి గల తేడా ఏమిటో చెప్పనక్కర లేదు.
ఈ విధంగా దీర్ఘకాలంగా నలుగుతున్న ఈ ప్రశ్నకు సహేతుకమైన సమాధానాన్ని కనుగొని పరిస్థితిని సరిదిద్దవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై వుంటుంది. కాని అందుకు బదులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తాము ఆర్థిక సంఘం సిఫారసులను తు.చ తప్పకుండ అమలు పరుస్తున్నామని సర్ది చెప్పబోయారు. కాని వాస్తవం ఏమంటే, ఆర్థిక సంఘం సిఫారసుల వెనుక కేంద్ర మంత్రాంగాలు, నిధుల బదిలీ ప్రాతిపదిక నిర్ణయాలు వుంటాయి. లేనిదే సంపన్న రాష్ట్రాల రాబడులను కొరత రాష్ట్రాలకు దశాబ్దాల తరబడి మళ్ళించడం జరగదు. ఇది చాలదన్నట్లు కేంద్రం బుధవారం నాడు కేరళకు ఆర్థిక క్రమ శిక్షణ లేదని ఆరోపిస్తూ సుప్రీం కోర్టు ముందు ఒక పత్రం దాఖలు చేసి, అసలు ప్రశ్నలను దాట వేసేందుకు ప్రయత్నించింది.

అదే రోజున ప్రధాని మోడీ లోక్‌సభలో మరొక చతురమైన వాదన చేశారు. జాతీయ నిధులపై రాష్ట్రాలు రాజకీయం చేస్తున్నాయని అది సరి కాదని అన్నారు. “మా పన్నులు, మా నిధులు అంటున్నారు. అదేమి భాష? దేశమంతా ఒకే శరీరం. ఏ భాగం పని చేయకున్నా అంగ వైకల్యం ఏర్పడుతుంది. హిమాలయాల నీటిని, మరొక రాష్ట్రం బొగ్గును ఇతర రాష్ట్రాలకు ఇవ్వబోమంటే ఏమవుతుంది?” అంటూ ప్రశ్నించారు. ఇది స్థూలంగా వినేందుకు సమంజసంగానే తోస్తుంది. కాని పైన చర్చించినట్లు ఉత్తరాది రాష్ట్రాల ఎడతెగని దశాబ్దాల అసమర్థ పాలనకు దక్షిణ రాష్ట్రాలు ఎందుకు మూల్యం చెల్లించాలనే ప్రశ్నకు ఇది సమాధాన మవుతుందా? కనుక, ఈ మౌలిక ప్రశ్నలకు జవాబులను మౌలిక స్థాయిలోనే కొనుగొనవలసి వుంటుంది. పులి మీద పుట్ర అన్నట్లు ఇటీవల మరొక తీవ్ర సమస్య ముందుకు వచ్చింది. జనాభాను సమర్థంగా నియంత్రిస్తున్నందున దక్షిణాదిన జనాభా ఒక స్థాయికి పరిమితమవుతుండగా, అటువంటి నియంత్రణ లేక ఉత్తరాది జనాభా పెరిగిపోతున్నది.

ఈ స్థితిలో లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజన జరిగినపుడు జనాభా ప్రాతిపదికన దక్షిణాది స్థానాలు ఇప్పటికన్నా తగ్గి ఉత్తరాది స్థానాలు పెరుగుతాయి. దక్షిణాది నాయకుల భయాలకు, తీవ్ర వ్యతిరేకతలకు ఇది మరొక ముఖ్య కారణమవుతున్నది. ఈ భయాలు తొలగించేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. ఒక వైపు ఇది, మరొక వైపు ఆర్థికం కలిసి సమస్య బాగా జటిలమవుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News