Sunday, January 12, 2025

ప్రజాస్వామ్యం ముసుగులో ఓ నియంత

- Advertisement -
- Advertisement -

‘డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా ప్రబలుతున్న తప్పుడు సమాచారం వ్యక్తిగత స్వేచ్ఛకు, మానవ హక్కులకు, ప్రజాస్వామ్యానికి పెను విఘాతంగా మారుతోంది. వాటిని అరికట్టవలసిన బాధ్యత ప్రజాస్వామిక దేశాలపై ఉంది’ ఈ మాటలన్నది మరెవరో కాదు, ఊహించని విధంగా దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా విధించి ప్రజాస్వామిక హక్కులను హరించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. మొన్న మార్చిలో సియోల్‌లో ప్రజాస్వామిక సదస్సును నిర్వహించి, దేశదేశాల ప్రతినిధుల ఎదుట ప్రజాస్వామ్యం గొప్పదనం గురించి నొక్కి వక్కాణించిన ఈ మహానేత.. విపక్ష పార్టీలు పొరుగున ఉన్న ఉత్తర కొరియాతో చేతులు కలిపి, తన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర పన్నుతున్నాయనే అభియోగంతో ఉన్నట్టుండి దేశంలో అత్యయిక స్థితిని విధించి, కొరియన్లనే కాదు, ప్రపంచ దేశాలను సైతం నివ్వెరపోయేలా చేశారు. యూన్ తీసుకున్న ఈ ఏకపక్ష, ఆకస్మిక నిర్ణయం సొంత పార్టీ అయిన పీపుల్ పవర్ పార్టీ నేతలనే విస్మయానికి గురి చేసిందంటే అతిశయోక్తి కాదు. ఈ దుందుడుకు, అనాలోచిత చర్య ద్వారా యూన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారు. మార్షల్ లా విధించిన మరుక్షణమే చట్టసభలకు చెందిన అధికార, విపక్ష సభ్యులు అప్రమత్తమయ్యారు. అప్పటికే వీధుల్లో తిరుగాడుతున్న యుద్ధ ట్యాంకుల్ని, తుపాకులు చేతబట్టి పహరా కాస్తున్న సైనికులను తప్పించుకుని, జాతీయ అసెంబ్లీ గోడలు దూకి లోపలకు ప్రవేశించి, యూన్ పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించారు.

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ తీర్మానం 190-0 తో నెగ్గిందంటే యూన్ మార్షల్ లా నిర్ణయాన్ని ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అత్యయిక పరిస్థితిని నిరసిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి, సైనికులను ఎదిరించి, నిరనస ప్రదర్శనలకు దిగారు. దీంతో ఎమర్జెన్సీ విధించిన ఆరు గంటల లోగానే తన నిర్ణయాన్ని యూన్ వెనక్కు తీసుకోవలసి వచ్చింది. అంతేకాదు, మరొకసారి ఇలాంటి తప్పు చేయనంటూ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పుకోవలసి వచ్చింది. రెండేళ్ల క్రితం అరకొర మెజారిటీతో గెలిచి అధ్యక్ష పదవిని చేపట్టిన యూన్.. పాలనపై పట్టు సాధించలేక అవస్థ పడుతున్నారు. జాతీయ అసెంబ్లీలో మెజారిటీ స్థానాలను విపక్ష డెమొక్రాటిక్ పార్టీ గెలుచుకుని, యూన్‌కు పక్కలో బల్లెంలా మారింది. దీనికితోడు ఇటీవల జరిగిన పలు సంఘటనలు అధ్యక్షుడి పాలనా సామర్థ్యాన్ని ప్రజలలో పలుచన చేశాయి. యూన్ పదవి చేపట్టిన కొన్ని నెలలకే రాజధాని సియోల్‌లో జరిగిన హాలోవీన్ ఉత్సవంలో తొక్కిసలాట జరిగి, దాదాపు 160 మంది మరణించారు.

సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందంటూ యూన్‌ను విపక్షాలు తూర్పారబట్టాయి. ఈ ఏడాది ఆరంభంలో పని గంటల భారం ఎక్కువైందంటూ డాక్టర్లు సమ్మెకు దిగడం, తాజాగా యూన్ భార్య ఖరీదైన ఒక హ్యాండ్ బ్యాగ్‌ను బహుమతిగా స్వీకరించడం వంటివి ఆయన ప్రతిష్ఠను మసకబార్చాయి. దేశంలో రానురాను ఆకాశాన్నంటుతున్న నిరుద్యోగితకు ముకుతాడు వేయడంలోనూ యూన్ విఫలమవడం ప్రతిపక్షాల చేతికి ఆయుధంగా మారింది. చట్టసభల్లో అధికార పక్షం ప్రవేశపెట్టిన బిల్లులను అడ్డుకోవడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలలో తన ప్రతిష్ఠ మసకబారేలా చేస్తున్న విపక్ష నేతలను జైలుపాలు చేసే దురుద్దేశంతో విధించిన అత్యయిక పరిస్థితి యూన్ మెడకు పాములా చుట్టుకుంది. నియంతల అరాచక పాలనలో పడరానిపాట్లు పడిన దక్షిణ కొరియా ప్రజలకు ఎమర్జెన్సీ పేరు చెబితే వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. యూన్ పాలన ప్రజాకంటకంగా ఉన్నప్పటికీ సహించిన సామాన్య జనం ఊహించని విధంగా ఎమర్జెన్సీ విధించడంతో పాత రోజులను జ్ఞప్తికి తెచ్చుకుని అప్రమత్తమయ్యారు. జనాభీష్టానికి ప్రజాప్రతినిధుల మద్దతుతోడు కావడంతో యూన్ తోక ముడవక తప్పలేదు.

అయితే విపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోవడం తాజా పరిణామం. తీర్మానం గెలవాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం ఉండగా, ఐదు ఓట్ల తేడాతో ఈ తీర్మానం వీగిపోయినట్లు జాతీయ అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. ఇప్పటికిప్పుడు అవిశ్వాస తీర్మానం గెలిస్తే, ఎన్నికలు తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అదే జరిగితే, అధికార పీపుల్ పవర్ పార్టీకి ఎన్నికల్లో పరాభవం తప్పదని పసిగట్టిన అధికారపక్ష సభ్యులు తీర్మానంపై ఓటింగ్‌ను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో మరొకమారు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడతామని విపక్ష సభ్యులు చెప్పడాన్ని బట్టి, యూన్‌కు ముప్పు తప్పిందని అనుకోవడానికి వీలు లేదు. ఇప్పటికైనా ప్రజాభిప్రాయాన్ని మన్నించి యూన్ పదవి నుంచి తప్పుకుంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించినవారవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News