సియోల్ : అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను బుధవారం అధ్యక్ష భవన ప్రాంగణంలో భారీ స్థాయిలోని భద్రత అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. తన చర్యలను దర్యాప్తు చేసే అధికారం అవినీతి నిరోధక సంస్థకు లేదని యూన్ గట్టిగా వాదించారు. అయితే, హింసాత్మక సంఘటనల నివారణకు తన మార్షల్ లా ఉత్తర్వును ఉపసంహరించుకున్నానని ఆయన స్పష్టం చేశారు. యూన్‌ను అవినీతి నిరోధక సంస్థ ప్రధాన కార్యాలయానికి తరలించే ముందు రికార్డు చేసిన వీడియో సందేశంలో ‘ఈ దేశంలో చట్టబద్ధ పాలన పూర్తిగా కుప్పకూలింది’అని ఆయన వాపోయారు. మార్షల్ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు యూన్‌ను నిర్బంధంలోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. భారీ సంఖ్యలో దర్యాప్తు అధికారులు బుధవారం తెల్లవారు జామున అధ్యక్ష నివాసానికి చేరుకున్నారు.
తొలుత అధ్యక్షుని భద్రత దళాలు వారిని అడ్డుకున్నాయి. కొంత సేపు ప్రతిష్టంభన తరువాత దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి యూన్ సుక్ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ ఆయనను అక్కడి నుంచి తరలించారు. లోగడ యూన్ అరెస్ట్‌కు ఒకసారి ప్రయత్నించినప్పుడు పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాల దృష్టా బుధవారం భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ దక్షిణ కొరియా అధ్యక్షుడు నిరుడు డిసెంబర్‌లో ‘ఎమర్జన్సీ మార్షల్ లా’ విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతోయూన్ తన ప్రకటన ఉపసంహరించుకున్నా ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు కోరాయి. ఈ నేపథ్యంలో మార్షల్ లా అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం మార్షల్ లా అమలు చట్టవిరుద్ధం అని స్సీకర్ ప్రకటించారు.
మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు యూన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 వోట్లు రాగా, వ్యతిరేకంగా 85 వోట్లు మాత్రమే వచ్చాయి. దీనితో యూన్ అభిశంసనకు గురై అధ్యక్ష అధికారాలను కోల్పోయారు. మరొక వైపు అత్యవసర పరిస్థితి విధించిన నేపథ్యంలో దానిపై విచారించేందుకు దర్యాప్తు అధికారులు పలు మార్లు సమన్లు జారీ చేశారు. వాటికి యూన్ స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించగా, ఆయన అరెస్టుకు వారంట్ జారీ అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా యూన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, అధికారంలో ఉన్న దక్షిణ కొరియా అధ్యక్షుని అదుపులోకి తీసుకోవడం ఇదే ప్రథమం. ఇది ఇలా ఉండగా, ‘భౌతిక సంఘర్షణలు’ ఏవీ జరగకుండా చూడాలని శాంతి భద్రతల యంత్రాంగానికి, అధ్యక్షుని భద్రత దళానికి విజ్ఞప్తి చేస్తూ దక్షిణ కొరియా తాత్కాలిక అధినేత, ఉప ప్రధాని చోయి సింగ్‌మోక్ బుధవారం తెల్లవారు జామున ఒక ప్రకటన జారీ చేశారు. యూన్ నిర్బంధం ‘రాజ్యాంగ శాసనాన్ని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, చట్టబద్ధ పాలన అమలు దిశగా తలి చర్య’ అని యూన్ అభిశంసనకు దారి తీసిన శాసనపరమైన ఉద్యమానికి సారథ్యం వహించిన లిబరల్ ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీ సభా నాయకుడు పార్క్ చాన్‌డే తెలిపారు.