హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు నేడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు మూడు రోజుల్లో ద్వీపకల్ప దక్షిణ భారతంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వివరించింది. ఈ నెల 11 నుంచి కర్ణాటక, ఎపి సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది. సోమ, మంగళవారాల్లో ఎపిలోని అన్ని ప్రాంతాలకు ఈ రుతుపవనాలు విస్తరించాయి. ఈమేరకు ఈ నెల 22వ తేదీ నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు..
తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడగాలు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచించారు. బుధవారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
13 జిల్లాలు… 36 మండలాల్లో వడగాల్పులు తీవ్రత
వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. పలుచోట్ల సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మం, రామగుండం, మెదక్, భద్రాచలం ప్రాంతాల్లో సాధారణం కన్నా 6 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాలోని 36 మండలాల్లో వడగాల్పులు వీచాయి. 10 మండలాల్లో వీటి తీవ్రత ఎక్కువగా నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది.