మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ ఏడాది జూన్ మొదటివారంలోనే తెలంగాణ ప్రాంతాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటికీ విస్తరించా యి. పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నా యి.అన్ని జిల్లాల్లోనూ పదును వానలు కురువడం తో వ్యవసాయరంగం మంచి జోష్‌లో ఉంది. రై తులు వ్యవసాయపనుల్లో బిజి అయ్యారు.నీటివనరులు అందబాటులో ఉన్న చోట వరినార్లు పోస్తున్నారు. వర్షాధారంగా జొన్న, మొక్కజొన్న కంది , పెసర, మినుము , వేరుశనగ, సోయాబీన్, ఆము దం , పత్తి విత్తనాలు నాటుకునే పనులు ఊపందుకున్నాయి. ఈ నెల రెండవ వారం నుంచే పొలా ల్లో విత్తనాలు వేసుకునే పనులు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్ కింద ఇప్పటి వరకూ 20,22,603 ఎకరాల విస్తీర్ణంలో విత్తనాలు పడ్డాయి. ఈ సీజన్‌లో అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 1,31,02,372 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయించాలని ప్రభుత్వం ప్రాథమిక లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఈ సమయానికి 13.46లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి రావాల్సివుంది.
అ యితే వాతావరణం అనుకూలించటంతో సీజన్ సాధారణం కంటే సుమారు ఏడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో అధికంగా విత్తనం పడింది.గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఈ సయయానికి 15.38లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. గత ఏడాదికంటే ఈ సారి వ్యవసాయరంగం మం చి ఊపుమీద ఉంది. ఖరీఫ్ సాగు విస్తీర్ణపు లక్ష్యా ల్లో ఇప్పటికే 15.44శాతం మేరకు పంటలు సాగులోకి వచ్చాయి. రాష్ట్రంలో పత్తి సాగుకు వాతావర ణం పూర్తి అనుకూలంగా మారింది. దీంతో వేసవి దుక్కులు దున్ని పెట్టుకుని సేద్యపు పనులు పూర్తి చేసుకున్న రైతులు తొలకరి వర్షాలకే పత్తి విత్తనం నాటుకునే పనిలో పడ్డారు. రాష్ట్రంలో ఈ ఏడాది 50.48లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు లక్షంగా ఎంచుకోగా, ఇప్పటికే 30.91శాతం విస్తీర్ణంలో పత్తినాటుకునే పనులు పూర్తయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 10.31లక్షల ఎకరాల్లో పత్తి విత్తనం పడాల్సివుంది. అయితే ఇప్పటికే 15.60లక్షల ఎకరాల్లో పత్తి విత్తనం పడింది. గత ఏడాది వాతావరణం అనుకూలించక తొలకరి వర్షాలు ఆలస్యం కావటంతో ఈ సమయానికి కేవలం 1.14లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తి విత్తనాలు వేసుకోగలిగారు.
ఈ ఏడాది 57.18లక్షల ఎకరాల్లో వరినాట్లు :
రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్ కింద ప్రధాన ఆహార ధాన్య పంటలకు సంబంధించిన లక్ష్యాల్లో నీటివనరుల లభ్యత ఆధారంగా 57.18లక్షల ఎకరాల్లో వరిసాగును ప్రాధమిక లక్షంగా ప్రభుత్వం నిర్దేశించింది. వర్షాధారం, నీటివనరుల లభ్యత ఆధారంగా ఇప్పటికే పలు జిల్లాలో 28236 ఎకరాల్లో వరినార్లు పోసుకున్నారు. వర్షాధారంగా జొన్న పంట 70వేల ఎకరాలు సాగు లక్షంగా పెట్టుకోగా , ఇప్పటివరకూ 13422 ఎకరాల్లో రైతులు జొన్న విత్తనం వేశారు.మొక్కజొన్న పంట 6.09లక్షల ఎకరాల్లో సాగు లక్షంగా పెట్టుకోగా, ఇప్పటివరకూ 37766 ఎకరాల్లో మొక్కజొన్న విత్తనం పడింది.
8.52లక్షల ఎకరాల్లో పప్పుధాన్య పంటలు :
పప్పుధాన్యాలకు మార్కెట్‌లో పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్‌లో రైతులు పప్పుధాన్యాల పంటలకు మొగ్గుతున్నారు. ప్రభుత్వం 8.52లక్షల ఎకరాల్లో పప్పుధాన్య పంటల సాగును లక్షంగా పెట్టుకుంది. అందులో కంది పంట 7.11లక్షల ఎకరాలు , పెసర్లు 1.01లక్షల ఎకరాలు, మినుము 35635 ఎకరాలు, ఉలవ పంట 1076 ఎకరాలు సాగు లక్షంగా పెట్టుకుంది. పప్పుధాన్య పంటల్లో ఇప్పటికే 76587ఎకరాల్లో కంది, 12482 ఎకరాల్లో పెసర విత్తనాలు పడ్డాయి. మరో 1263ఎకరాల్లో మినుము పంట వేశారు. ఇప్పటివరకూ పప్పుధాన్య పంటల సాగువిస్తీర్ణం 90332ఎకరాలకు చేరుకుంది.
5.48లక్షల ఎకరాల్లో నూనెగింజ పంటలు:
ఈ సీజన్‌లో అన్ని రకాల నూనెగింజ పంటలు కలిపి మొత్తం 5.48లక్షల ఎకరాల్లో సాగులోకి తేవాలని వ్యవసాయశాఖ లక్షంగా పెట్టుకుంది. అందులో వేరుశనగ 28464 ఎకరాలు, సోయబీన్ 4,29,477 ఎకరాలు లక్షంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 15180 ఎకరాల్లో నూనెగింజ పంటలు సాగులోకి వచ్చాయి.
60వేల ఎకరాల్లో చెరకు సాగు:
రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి తర్వాత స్థానం చెరకు పంట ఆక్రమించింది. ఈ సీజన్‌లో మొత్తం 60వేల ఎకరాల్లో చెరకు సాగును ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఇప్పటికే 2597 ఎకరాల్లో చెరకు విత్తనం నాటేశారు.