Monday, January 20, 2025

సౌత్‌జోన్‌కు నాలుగో విజయం

- Advertisement -
- Advertisement -

పుదుచ్చేరి: దేవ్‌ధర్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో సౌత్‌జోన్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సౌత్‌జోన్ ఐదు వికెట్ల తేడాతో ఈస్ట్‌జోన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ 46 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌత్ టీమ్ 44.2 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ రోహన్ (18) పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్‌తో కలిసి మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ స్కోరును ముందుకు నడిపించాడు. ఇద్దరు ఈస్ట్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఈస్ట్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు.

కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మయాంక్ అగర్వాల్ 88 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 84 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. మరో వైపు సాయి సుదర్శన్ 4 ఫోర్లు, ఒక ఫోర్‌తో 53 పరుగులు చేశాడు. ఇక వికెట్ కీపర్ జగదీశన్ (32), రోహిత్ రాయుడు 24 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించడంతో సౌత్‌జోన్ అలవోక విజయాన్ని అందుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సౌత్ బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్ విరాట్ సింగ్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వారిలో సేనాపతి (44), ఆకాశ్ దీప్ (44), ముఖ్తార్ హుస్సేన్ (33) పరుగులు చేశారు. సౌత్ బౌలర్లలో వసూకి కౌశిక్, సాయి కిశోర్ మూడేసి వికెట్లు పడగొట్టారు.
సెంట్రల్ జోన్ గెలుపు..
మరో మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ 8 వికెట్ల తేడాతో నార్ట్‌ఈస్ట్ జోన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్‌ఈస్ట్ 164 పరుగులకే కుప్పకూలింది. ఆశీష్ థాపా (31), కెప్టెన్ కిషన్ (24), వికెట్ కీపర్ కమ్షా యంగ్ఫో (35), రెక్స్ సింగ్ (27) పరుగులు చేశారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో సర్వాటే మూడు, యశ్ కొథాన్, సారంశ్ జైన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్ 33 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ శివమ్ చౌదరీ 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా నిలిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన యశ్ దూబే 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 72 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News