హైదరాబాద్: పేరు మోసిన ఘరానా దొంగను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సిద్ధిపేట పోలీసులు కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేస్తున్న అన్నను, సొత్తును డిస్పోజ్ చేస్తున్న తమ్ముడిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 61.7 తులాల బం గారు ఆభరణాలు, 1.10కిలోల వెండి వస్తువులు, మొత్తం రూ. 32లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎనిమిది ప్రాంతాల్లో చోరీ చేసినట్లు గుర్తించారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని బోడుప్పల్‌కు చెందిన ఎండి సద్దాం అలీ అలియాస్ ఇమ్రాన్ వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. అతడి తమ్ముడు ఎండి అన్వర్ అలీ వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. సద్దాం గత కొన్నేళ్ల నుంచి దొంగతనాలు చేస్తున్నాడు.
నిందితుడిపై తెలంగాణలో 53 కేసులు ఉన్నాయి. 2015లో మరో నిందితుడు పోతురాజుతో కలిసి చోరీలు చేయడంతో మల్కాజ్గిరి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. 2018లో గోపాలపురం పోలీసులు పిడి యాక్ట్ పెట్టారు. జైలు నుంచి అక్టోబర్, 2020లో విడుదలయ్యాడు, అప్పటి నుంచి వరంగల్, సిద్దిపేట, గుంటూరులో దొంగతనాలు చేశాడు. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కూడా చోరీలు చేశాడు. నిందితుడు ధనవంతులు ఉండే కాలనీల్లో రెక్కీ నిర్వహించి చోరీలు చేసేవాడు. దొంగతనం చేసిన సొత్తును తన సోదరుడికి ఇచ్చి డిస్పోజ్ చేయించేవాడు. ఈ క్రమంలోనే సద్దాం తమ్ముడు చోరీ చేసిన సొత్తును డిస్పొజ్ చేసేందుకు యత్నిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై నిందితుడిని పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం సిద్ధిపేట పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ ఎడిసిపి చక్రవర్తి గుమ్మి, ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు నరేందర్, శ్రీశైలం, ఎండి తకియుద్దిన్, చంద్రమోహన్ తదితరులు పట్టుకున్నారు.