Friday, November 15, 2024

సౌత్‌జోన్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

పుదుచ్చేరి : దేవధర్ వన్డే ట్రోఫీలో భాగంగా సోమవారం నార్త్‌జోన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో సౌత్ జోన్ 185 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్‌జోన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో విజెడి పద్ధతిలో నార్త్‌జోన్ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 245 పరుగులకు కుదించారు. అయితే లక్షఛేదనకు దిగిన నార్త్‌జోన్ 23 ఓవర్లలో 60 పరుగుకే కుప్పకూలింది. విధ్వత్ కవెరప్ప అద్భుత బౌలింగ్‌తో నార్త్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. విధ్వత్ 6 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.

విజయ్‌కుమార్ విశ్వక్ రెండు వికెట్లు తీసి తనవంతు పాత్ర పోషించాడు. నార్త్ టీమ్‌లో ఓపెనర్ శుభమ్ ఖజూరియా (10), మన్‌దీప్ సింగ్ (18) మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్‌జోన్‌కు ఓపెనర్లు రోహన్ కున్నుమ్మల్, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించారు. రోహన్ 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మయాంక్ అగర్వాల్ ఏడు ఫోర్లతో 64 పరుగులు సాధించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన వికెట్ కీపర్ జగదీశన్ 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. రికి భుయ్ (31), అరుణ్ కార్తీక్ (21) తమవంతు పాత్ర పోషించారు. దీంతో సౌత్‌జోన్ 303 పరుగుల భారీ స్కోరును సాధించింది.

వెస్ట్‌జోన్ గెలుపు
నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో వెస్ట్‌జోన్ 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసి నార్త్‌ఈస్ట్ జోన్ 47 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. వెస్ట్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీసి నార్త్‌ఈస్ట్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. అర్జాన్ నాగ్‌వస్వలా మూడు, శమ్స్ ములాని, శివమ్ దూబే రెండేసి వికెట్లు పడగొట్టారు. నార్త్‌ఈస్ట్ టీమ్‌లో ఇమ్లివటి లెంటూర్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ కిషంగ్‌బమ్ (30), పల్జొర్ తమంగ్ (29) తప్ప మిగతావారు విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌జోన్ 25.1 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు హార్విక్ దేశాయ్, ప్రియాంక్ పంచల్ విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన పంచల్ 69 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో 7 ఫోర్లతో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హార్విక్ 71 బంతుల్లోనే 14 ఫోర్లతో 85 పరుగులు చేశాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 167 పరుగులు జోడించి శుభారంభం అందించారు.

ఈస్ట్‌జోన్ జయకేతనం
సెంట్రల్ జోన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్ ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్ 207 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఆర్యన్ జుయల్ ఐదు ఫోర్లతో 39 పరుగులు చేశాడు. రింకు సింగ్ (54), కర్ణ్‌శర్మ (32) తమవంతు పాత్ర పోషించారు. మిగతావారు విఫలం కావడంతో సెంట్రల్ ఇన్నింగ్స్ తక్కువ స్కోరు వద్దే ముగిసింది. ఈస్ట్ బౌలర్లలో మణిశంకర్ మురాసింగ్, ఆకాశ్‌దీప్, షాబాజ్ అహ్మద్‌లు మూడేసి వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్‌జోన్ 46.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్, ఉత్క్రష్ సింగ్‌లు జట్టుకు శుభారంభం అందించారు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన ఈశ్వరన్ ఐదు ఫోర్లతో 38 పరుగులు చేశాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన ఉత్క్రష్ సింగ్ 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 91 పరుగులు జోడించి మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇక సుబ్రాన్షు సేనాపతి 33 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించడంతో ఈస్ట్ అలవోక విజయాన్ని అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News