Tuesday, April 8, 2025

దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే కుట్ర జరుగుతోంది

- Advertisement -
- Advertisement -

ఐక్య పోరాటాలతో ఎదుర్కోవాలి : ఎంఎల్‌సి కోదండరాం
మన తెలంగాణ / హైదరాబాద్ : పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన కేవలం నియోజకవర్గాల సరిహద్దులు మార్చడమే కాదు, దేశ రాజకీయ భవిష్యత్తును రూపుదిద్దే కీలక ఘట్టమని తెలంగాణ జనసమితి అధ్యక్షులు, ఎంఎల్‌సి ప్రొ. కోదండరాం అన్నారు. బిజెపి ప్రభుత్వం తెస్తున్న పునర్విభజన దక్షిణాది రాష్ట్రాల ప్రజాస్వామిక ప్రాతినిధ్యాన్ని నెమ్మదిగా తగ్గించాలనే కుట్ర అని ఆయనన్నారు. ఇందుకు రాజకీయ శక్తులు ఎంతో సూటిగా పనిచేస్తున్నాయని. దీనిని ఎదుర్కొనాలంటే ప్రజలు, రాజకీయ పార్టీలు, విద్యావంతులు, సమాజ బలగాలు అన్ని కలసి పోరాటం చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ‘పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన, – దక్షిణ భారత భవిష్యత్తు‘ అనే అంశంపై రాష్ట్రస్థాయి సెమినార్ జరిగింది.

ఎంఎల్‌సి కోదండారం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులు పాల్గొని బిజెపి తెస్తున్న పార్లమెంటరీ పునర్విభజనపై ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విసికె పార్టీ జాతీయ అధ్యక్షులు, చిదంబరం ఎంపీ డా. తిరుమావళవన్ మాట్లాడుతూ ప్రస్తుతం జరిగే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అనేది దేశానికి అతి ముఖ్యమైందని అన్నారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ హితం కొరకు జనాభా నియంత్రణనను పకడ్బందీగా అమలుచేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఇది ఒక శాపంగా మారుతుందన్నారు.

మోడీ ప్రభుత్వం పునర్విభజన పేరుతో ఉత్తరాది రాష్ట్రాలలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల లోక్ సభ సీట్లను భారీగా పెంచాలని కుట్రలు చేస్తుందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని అన్నారు. హిందూమతం ఒక వ్యక్తిగత విశ్వాసమైతే, హిందూత్వవాదం మాత్రం ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ ఐడియాలజీ అని, బిజెపి దానిని ప్రయోజనంగా మార్చుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, ఆదివాసులు, ముస్లింల ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలను విభజన చేసి, అశాస్త్రీయంగా వాటి సరిహద్దులను కూడా మార్చడానికి కుట్రలు చేయబోతుందని ఆరోపించారు. అందుకే దక్షిణాది రాష్ట్రాలు పునర్విభజన పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

తమిళనాడు విల్లుపురం ఎంపీ డి. రవి కుమార్ మాట్లాడుతూ పునర్విభజనను కేంద్ర ప్రభుత్వం ఒక ఆయుధంగా ఉపయోగించాలని చూస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో బిజెపి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నం చేసిందని, ఇది సాధ్యం అయ్యే పరిస్థితి లేనందున పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించాలనే కుట్రలకు తెర తీశారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి అంతిమ లక్ష్యం దేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించడమని అన్నారు. దీనికి పార్లమెంటులో 2/3 మెజారిటీ అవసరమని, బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరాది, హిందీ బెల్టు రాష్ట్రాలలో సీట్లను పెంచేలా పునర్విభజనకు ప్లాన్ చేయబోతుందన్నారు. అందుకే ఈ పునర్విభజనను మనం తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. దీని కోసం దక్షిణాది రాష్ట్రాల ప్రజలందరూ ఏకతాటిమీదికి వచ్చి పోరాటం చేయాలన్నారు.

సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్మపద్మ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సిపిఐ (ఎం.ఎల్.) న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకులు కె.గోవర్ధన్, దళిత బహుజన ప్రంట్ నాయకులు కొరివి వినయ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి అద్దంకి దయాకర్, టిజెఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు, అంబటి శ్రీనివాస్, నాయకులు దర్మార్జున్, బైరి రమేష్, పల్లె వినయ్, నిజ్జన రమేష్, ఆషప్ప, నర్సయ్య, సలీం పాషా, అరుణ్ కుమార్, సీనియర్ పాత్రికేయులు కె. రామచంద్ర మూర్తి , ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన డా. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News