రానున్న రెండురోజుల పాటు ఉరుములు, మెరుపులులతో కూడిన వర్షాలు
హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రం మొత్తం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల రెండు రోజుల్లో కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకి, కొంకన్ అండ్ గోవాలోని కొన్ని ప్రాంతాలకు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోకి మొత్తం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని భాగాలకు, ఈశాన్య బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో వాయువ్య దిశనుంచి కింది స్థాయి గాలులు రాష్ట్రంలోకి వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం అక్కడక్కడా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.