Sunday, November 17, 2024

రుతురాగం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :వర్షాకాలం వచ్చేస్తోంది. మరో పది రోజుల్లో రుతుపవనాలు దేశ భూబాగంలోకి ప్రవేశించనున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయి. ఇవి చురుకైన కదలికలతో వేగంగా దూసుకొస్తున్నాయి. ఈ నెల 31నాటికి కేరళ తీరాన్ని తాకనున్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రుతువపనాలు అనుకున్నదానికంటే మరింత క్రి యాశీలకంగా మారటంతో వచ్చే నెల 5న రాయల సీమ మీదుగా తెలుగుగడ్డపైకి ప్రవేశించునన్నట్టు తెలిపింది. ఈ నెల రెండవ వారం లో తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. 12 తర్వాత ఇవి పూర్తిగా రాష్ట్రమంతటికి విస్తరించే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా నైరుతి రుతుపవనాల రాక , వాటిలో కదలిక , క్రియాలకంగా మారటం , తెలుగు రాష్ట్రాల్లో వాటి విస్తరణ మారుతూ వస్తోం ది. భారత వాతవరణ శాఖ నివేదికల ప్రకారం, కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. మొదటిసారి ముందుగా 1918లో మే 11నే ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972 జూన్ 18న
ప్రవేశించాయి.

ఇక గతేడాది 2023లో జూన్ 8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరో వారం రోజులు ముందుగానే కేరళతీరాన్ని తాకబోతున్నాయి. రుతుపనవాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని ఇటీవల ఐఎండీ అంచనా వేసింది. దీర్ఘకాల సగటు ఎల్‌పిఏతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్‌లో 106 శాతం వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. వచ్చే సీజన్‌లో ఎల్‌పిఏ 87 సెంటీమీటర్లగా అంచనా వేసింది. లానినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉండడం వల్ల ఆగస్టు- సెప్టెంబరు నాటికి ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. 1951 నుంచి 2023 వరకు ఎల్ నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్‌లో 9 సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపింది. లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు-సెప్టెంబరు కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావొచ్చని పేర్కొంది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని తెలిపింది.

26వరకూ వర్షాలే!
ఈనెల 22న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది తొలుత వాయువ్య దిశలో కదిలి ఈనెల 24నాటికి మధ్యబంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 26వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 24గంటల్లో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు గంటకు 40కి.మి వేగంతో కూడిన బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. మంగళవారం నాడు రాష్ట్రంలో కరీంనగర్ , పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ , హన్మకొండ, జనగాం, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాగల 48గంటల్లో హైదరబాద్ పరిసర ప్రాంతాలకు ప్రత్యేక వాతావరణ సూచన చేసింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37డిగ్రీలు , కనిష్టంగా 25డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

అబ్ధుల్లాపూర్ మెట్‌లో 52.3మి.మి వర్షం
సోమవారం రాష్ట్రలోని పలు ప్రాంతాలో ఒక మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షం కురిసింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని అబ్ధుల్లాపూర్ మెట్ మండలం పసుమాముల్లలో 52.3మి.మి వర్షం కురిసింది. కొండంగల్‌లో 35, గుండమల్‌లో 34.8, కల్వకుర్తిలో 30.5, తూడుకుర్తిలో 26, ఎర్రుపాళెంలో 25, గచ్చిబౌలిలో 18.5 మి.మి చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలోని 100ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. రాష్ట్రంలో గరిష్టంగా అదిలాబాద్ జిల్లా బేలలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News