రేపు తెలంగాణలో అరుదైన వాతావరణం
మనతెలంగాణ/హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి నిష్క్రమిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో ప్రవేశించిన ఈ రుతుపవనాల తిరోగమణ ప్రక్రియ ఈనెల రెండవ వారంలోనే ప్రారంభమైనట్టు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నాటికి హనుమకొండ వరకూ విరమించిన నైరుతి రుతుపవనాలు రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని మరికొన్ని భాగాలనుంచి విరమించే అవకాశం ఉంది. తెలంగాణలో ఈనెల 15న వాతావరణ పరంగా అరుదైన ప్రక్రియ జరగనుందని, రెండు అల్పపీడనాలు ప్రభావం చూపే సూచనలు ఉన్నట్టు వాతవారణ నిపుణులు తెలిపారు.
ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 5.8కి.మి ఎత్తు వరకూ కొనసాగుతూ మరింత ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశవైపుకి వంపు తిరిగి ఉందని తెలిపారు. ఈ అవర్తన ప్రభావం వల్ల తూర్పు, మద్య బంగాళాఖాతం , దాని పరిసర ప్రాంతాల్లో రాగాల 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయివ్యదిశగా ప్రయాణించి 24గంటల్ల దక్షిణ ఒడిస్సా , ఉత్తర కోస్తా తీరానికి చేరుకునే అవకాశం ఉంది. బుధవారం ఉపరితల ఆవర్తనం మధ్యఅరేబియా కోస్తా కర్ణాటక తీరం నుంచి తెలంగాణ వరకూ వ్యాపించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.