ప్రవేశించనున్న ఈశాన్య రుతుపవనాలు: ఐఎండి
న్యూఢిల్లీ: ఈ నెల 26 వరకల్లా నైరుతి రుతుపవనాలు దేశాన్ని పూర్తిగా వీడనున్నాయని భారత వాతావరణశాఖ(ఐఎండి) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక దేశంలోకి ఈశాన్య రుతు పవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. వాయువ్య భారత్‌లో నైరుతి ఉపసంహరణ కాస్త ఆలస్యంగా ఉంటుందని పేర్కొన్నది. ప్రస్తుతం నైరుతి ఉపసంహరణ మార్గం కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బరిపడా, మల్కాన్‌గిరి, నల్గొండ, బాగల్‌కోట్, వెంగుర్లా మీదుగా సాగుతున్నదని ఐఎండి తెలిపింది. ఈశాన్య భారత్ నుంచి నైరుతి ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడినాయని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో పూర్తిగా, బెంగాల్, ఒడిషాలోని మిగతా ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,కర్నాటకలోని కొన్ని భాగాల్లో,గోవా మొత్తం,అరేబియా సముద్రంలోని మధ్య ప్రాంతం నుంచి ఈ నెల 23వరకల్లా నైరుతి ఉపసంహరణకు అనుకూల పరిస్థితులున్నాయని తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దేశంలోని ఆగ్నేయ ప్రాంతాల్లో ఈ నెల 26 నుంచి వర్షాలు ప్రారంభమవుతాయని ఐఎండి తెలిపింది. ఈశాన్య రుతుపవనాల వల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, పుదుచ్చేరిల్లోని కొన్ని భాగాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సాధారణంగా దేశంలోని వాయువ్య ప్రాంతంలో సెప్టెంబర్ 17న ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి అక్టోబర్ 6కు జరిగిందని ఐఎండి తెలిపింది. 1975 తర్వాత నైరుతి ఉపసంహరణ ఇంతగా ఆలస్యం కావడం ఇది రెండోసారి. 2019లో నైరుతి ఉపసంహరణ అక్టోబర్ 9న ప్రారంభమైంది.