ముంబై: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును అవమానిస్తూ ఎస్పీ ఎంఎల్‌ఏ అబు అసిం అజ్మీ చేసిన వ్యాఖ్యలు మంగళవారం మహారాష్ట్ర శాసన సభ ఉభయ సభలను కుదిపేశాయి. అధికారంలో ఉన్న మహాయుతి సభ్యులు ఆయనను సస్పెండ్ చేయాలని, ఆయనపై రాజద్రోహం అభియోగం మోపాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఎన్సీపి మంత్రి ధనంజయ్ ముండే రాజీనామాపై ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి… ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్లాన్ చేసిన రోజున ఈ పరిణామం చోటుచేసుకుంది. ఉభయ సభల కార్యకలాపాలు ప్రారంభం కాగానే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అజ్మీపై చర్య తీసుకోవాలని కోరతూ మహాయుతి సభ్యులు నినాదాలు చేశారు.
అజ్మీ మరాఠ రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ను హింసించి దారుణంగా చంపిన ఔరంగజేబు వారసుడని వారు దుయ్యబట్టారు. ఉపముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే శాసన మండలి, శాసనసభలో అజ్మీపై దాడికి నాయకత్వం వహించారు. శాసన మండలిలో మాజీ ముఖ్యమంత్రి అయిన ఏక్‌నాథ్ షిండే ‘అజ్మీ ఇదివరలో కూడా మరాఠ రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై అభ్యంతరకర ప్రకటనలు చేశారు. అబు అజ్మీ కావాలనే శివాజీ కుమారుడు ఛత్రపతి శంభాజీని కూడా కించపరిచారు. శంభాజీ మహారాజ్ ధైర్యం, ఔరంగజేబు క్రూరత్వం ప్రజల రోమాలు నిక్కబొడిచేలా(గూస్‌బంప్స్) చేస్తాయి’ అని షిండే వివరించారు.
‘ఔరంగజేబు శంభాజీ మహారాజ్‌ను అమానవీయ పద్ధతిలో చిత్రహింసలు పెట్టాడు. ఔరంగజేబు మంచి పరిపాలనదక్షుడని, మందిరాలు నిర్మించాడని, కానీ కాశీ విశ్వేశర మందిరాన్ని ధ్వంసం చేశాడని అజ్మీ పేర్కొన్నారు’ అని షిండే అన్నారు. ‘ఔరంగజేబు కేవలం హిందువులనే కాదు, ఇతర మతస్థులను కూడా హింసించాడు. ఔరంగజేబు గెలిచినా ఓడిపోయినవాడి కిందే లెక్క. కాగా శంభాజీ తన ధైర్య సాహసాలతో ప్రాణ త్యాగం చేసినా గెలిచినట్లే లెక్క. ఔరంగజేబు ఓ దయ్యం. ఔరంగజేబును కీర్తించడాన్ని ఎవరూ సహించరు.అజ్మీ ఓ ద్రోహి. అతడికి మహారాష్ట్ర అసెంబ్లీలో కూర్చునే అర్హత లేదు.
వీలయితే అతడు ఛావ సినిమా చూడాలి. ఔరంగజేబు, శంభాజీ మహారాజ్‌ను మతం మార్చుకోమని ఒత్తిడి చేశాడు. శంభాజీ తొమ్మిదేళ్లలో 70 యుద్ధాల్లో గెలిచాడు. ఔరంగజేబు మందిరాలను ధ్వంసం చేశాడు. తన కుటుంబాన్నే చంపించాడు ’ అని షిండే వివరించారు. ఇదిలావుండగా ఔరంగజేబు కాలంలో భారత్ సరిహద్దు అఫ్ఘానిస్థాన్, బర్మా(మయన్మార్) వరకు విస్తరించిందని, నాడు మన దేశాన్ని బంగారు పిచ్చుకతో పోల్చారని అజ్మీ అసెంబ్లీలో వివరించాడు. ఈ వాదోపవాద నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ కార్యకలాపాలు మూడుసార్లు వాయిదా పడింది.