రెండు రోజులముందే నిఘా సమాచారం
పోలీసులువైపున సి60 కమాండోలుసహా 300మంది
10 గంటలపాటు ఎదురుకాల్పులు
తేల్టుంబ్డేను కోల్పోవడం మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ
గడ్చిరోలీ ఎన్‌కౌంటర్‌పై ఆ జిల్లా ఎస్‌పి అంకిత్‌గోయల్
నాగపూర్: శనివారం మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఆ జిల్లా ఎస్‌పి అంకిత్‌గోయల్ వివరణ ఇచ్చారు. కోర్చీ తహసిల్ గ్యారాపట్టీ ప్రాంతంలోని మార్దిన్‌తోలా అడవిలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందన్నారు. ఆపరేషన్ చేపట్టడానికి రెండు రోజులముందే తమకు నిఘావర్గాల నుంచి సమాచారమున్నదన్నారు. నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌లో మొత్తం 300మంది పోలీసులు పాల్గొన్నారని, వారిలో ప్రత్యేక కార్యాచరణ బృందం(శాట్)కు చెందిన సి60 కమాండోలున్నారని ఆయన తెలిపారు. ఎన్‌కౌంటర్ ప్రారంభమైన సమయంలో 100మందికిపైగా నక్సలైట్లున్నారని తెలిపారు. అత్యాధునిక ఆయుధాలతో వారే ముందుగా భారీ ఎత్తున కాల్పులు ప్రారంభించారని గోయల్ తెలిపారు.
తమ ఆపరేషన్ గురువారం రాత్రే ప్రారంభమైందని, ఎన్‌కౌంటర్ మాత్రం శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై సాయంత్రం 330 గంటలకు ముగిసిందన్నారు. దాదాపు 10 గంటలపాటు ఎన్‌కౌంటర్ జరిగినట్టు గోయల్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 26మంది నక్సలైట్లు మృతి చెందగా, నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారని గోయల్ తెలిపారు. ఇప్పటివరకు 16 మృతదేహాలను గుర్తించామన్నారు. వారిలో కొందరిపై భారీ రివార్డులున్నాయన్నారు. మిలింద్‌తేల్టుంబ్డేపై రూ.50 లక్షల రివార్డు ఉన్నదన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో తేల్టుంబ్డే చనిపోవడం మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బగా ఆయన పేర్కొన్నారు. మహరాష్ట్రలోనేగాక, దేశవ్యాప్తంగా ఆ పార్టీకి తీవ్ర నష్టమని గోయల్ తెలిపారు. మహారాష్ట్రలో మావోయిస్ట్‌లతో లింక్‌లున్నాయన్న ఆరోపణలతో నమోదైన ఎల్గార్ పరిషద్ కేసులో తేల్టుంబ్డే నిందితుడని, వాంటెడ్ జాబితాలో ఆయన పేరున్నదని మరో సీనియర్ అధికారి తెలిపారు. ఆదివారం గోయల్ మీడియాతో మాట్లాడుతున్నపుడు ఆయన పక్కన గడ్చిరోలీ డిఐజి సందీప్‌పాటిల్‌తోపాటు ఇతర సీనియర్ అధికారులున్నారు.