లక్నో : సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య తన పదవికి రాజీనామా చేశానని ప్రకటించారు. పార్టీ నేతల మధ్య పార్టీ అధిష్ఠానం ‘వివక్ష’ ప్రదర్శిస్తోందని, తన వ్యాఖ్యలపై తనను విమర్శించినవారిని ‘క్రమశిక్షణలో’ పెట్టలేదని ఆయన ఆరోపించారు. అయితే, ‘ఏ పదవీ లేకుండానే పార్టీని పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తూనే ఉంటా’ అని మౌర్య పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌కు పంపిన రాజీనామా లేఖలో స్పష్టం చేశారు.
సమాజంలో నెలకొన్న ‘సనాతనవాదం, మూఢవిశ్వాసం, నిర్హేతుకత’కు వ్యతిరేకంగా తాను చేసిన వ్యాఖ్యలను ఎస్‌పి సీనియర్ నేతలు కొందరు తన ‘వ్యక్తిగత అభిప్రాయం’ అని, ఎస్‌పివి కావని చిత్రించజూశారని అఖిలేశ్‌కు రాసిన లేఖలో మౌర్య ఆరోపించారు. దళితులను సమైక్యపరచడానికి, సమాజంలో కుల ఆధారిత వివక్షను వ్యతిరేకించడానికి తాను ఆ వ్యాఖ్యలు చేశానని మౌర్య తెలిపారు. ‘దళితులు, వెనుకబడిన తరగతుల వారు బిజెపి వలలో పడకుండా నిరోధించడం నా ఉద్దేశంఅయినప్పటికీ నా వ్యాఖ్యలను నా వ్యక్తిగత అభిప్రాయంగా అభివర్ణించారు’ అని మౌర్య ఆ లేఖలో పేర్కొన్నారు.