Tuesday, March 11, 2025

రాజ్యసభలో నుంచి ఎస్పీ వాకౌట్..

- Advertisement -
- Advertisement -

రాజ్యసభలో మామూలుగా కార్యకలాపాలు
42 వాయిదా నోటీసులు అందాయన్న చైర్మన్ ధన్‌ఖడ్
దేనినీ అంగీకరించలేదన్న చైర్మన్
జీరో అవర్‌లో ఎస్‌పి వాకౌట్
న్యూఢిల్లీ : రోజుల పాటు సభా కార్యకలాపాలు తుడిచిపెట్టుకుపోయిన తరువాత రాజ్యసభ మంగళవారం మామూలుగా పని చేసింది. ప్రజా ప్రాధాన్యం ఉన్న అంశాలను సభ్యులు ప్రస్తావించారు. సభ నిర్ణీత జీరో అవర్‌ను ముందు చేపట్టింది. ఆ తరువాత ప్రశ్నోత్తరాల సమయం సాగింది. అదానీ గ్రూప్‌పై అవినీతి ఆరోపణలు, యుపి సంభాల్‌లో హింసాకాండ సహా పలు సమస్యలపై ప్రతిపక్ష సభ్యులు రభస సృష్టిస్తుండడంతో నవంబర్ 25న శీతాకాల సెషన్ ప్రారంభమైనప్పటి నుంచి రాజ్యసభ ఎటువంటి కార్యకలాపాన్నీ నిర్వహించలేకపోయింది. కాగా, మంగళవారం జీరో అవర్ (ఉదయం సెషన్)లో సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) సభలో నుంచి వాకౌట్ చేసింది. టిఎంసి సభ్యులు కూడా కొద్ది సేపు వాకౌట్ చేశారు. 267 నిబంధన కింద తనకు 42 వాయిదా నోటీసులు అందాయని, రాజ్యాంగాన్ని ఆమోదించిన శతాబ్ది చివరి త్రైమాసికంలో ఇంత వరకు ఇవే అధికమని చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ అంతకుముందు చెప్పారు. తాను నోటీసుల్లో దేనినీ అంగీకరించలేదని ఆయన తెలిపారు. ఎంపి ఒకరు 267 నిబంధన కింద ఒకటికి మించి నోటీసులు ఇచ్చారని, ఆ సభ్యునికి వాటి ప్రస్తావనకు అవకాశం ఇవ్వడం ఏమాత్రం సాధ్యం కాదని ధన్‌ఖడ్ స్పష్టం చేశారు. 267 కింద నోటీస్‌ను పరిశీలించే ముందే బహిరంగపరచడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అది ‘నిబంధనలను బేఖాతరు చేయడమే’ అని, అది మరీ తీవ్రమైన విషయమని చైర్మన్ అభివర్ణించారు. వివిధ పార్టీల నేతల దృష్టికి దీనిని తీసుకువెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. అత్యున్నత నైతిక ప్రమాణాలు పాటించవలసిందిగా సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత సభ జీరో అవర్ ప్రస్తావనలతో సాగింది. చైర్మన్ ముందస్తు అనుమతితో ఆ సమయంలో అంశాలను సభ్యులు ప్రస్తావించారు. తమిళనాడులో ఫెంగల్ తుపాను సృష్టించిన సమస్యలను ఎం మొహమద్ అబ్దుల్లా (డిఎంకె), వైకో (ఎండిఎంకె) సభ దృష్టికి తీసుకువచ్చారు. ఒడిశా పూరిలో ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేసి, పని చేయించాలని సుభాశీశ్ ఖుంతియా (బిజెడి) కోరారు. రామ గోపాల్ యాదవ్ (ఎస్‌పి) సంభాల్‌లో ఇటీవలి హింసాకాండ అంశాన్ని లేవదీశారు. కాంగ్రెస్ ఎంపి ప్రమోద్ తివారి కూడా ఆ అంశంపై మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News