Sunday, February 2, 2025

అంతరిక్షంలో భారత్ మరో విజయం

- Advertisement -
- Advertisement -

గత ఏడాది డిసెంబర్ 30న ప్రారంభించిన స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) మిషన్‌ను 2025 జనవరి 16న భారత్ విజయవంతంగా పూర్తి చేసి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దీంతో అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను కలిపే డాకింగ్ ప్రక్రియను చేపట్టగల అమెరికా, రష్యా, చైనాల తర్వాత దేశాల సరసన చేరింది. ఈ విజయంతో ప్రపంచంలో ఈ సాంకేతిక విజయాన్ని సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అంతరిక్ష చరిత్రలో భారత్ తన పేరును లిఖించుకుంది. ‘డాకింగ్‌లో ఇస్రో చేపట్టిన స్పాడెక్స్ మిషన్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ క్షణాన్ని చూడటం మాకు గర్వంగా ఉంది’ అని ఇస్రో పేర్కొంది. ఈ సాంకేతిక పురోగతి అంతరిక్ష రంగంలో భారతదేశ పురోగతిని నొక్కిచెప్పడమే కాకుండా మరింత సంక్లిష్టమైన మిషన్లకు కొత్త అవకాశాలను తెరుస్తుంది.

ప్రపంచ అంతరిక్ష సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న దేశస్థానాన్ని బలోపేతం చేస్తుంది. స్పాడెక్స్ స్వదేశీ ఆవిష్కరణలలో భారతదేశం పురోగతికి నిదర్శనం. ఇది ప్రపంచ అంతరిక్ష పటంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. అంతరిక్షంలో ‘డాకింగ్’ అనే పదం రెండు అంతరిక్ష వస్తువులు (అంతరిక్ష నౌక లేదా ఉపగ్రహాలు వంటివి) కలిసి ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం చేరే ప్రక్రియను సూచిస్తుంది. సరళంగా చెప్పాలంటే రెండు అంతరిక్ష వాహనాలు స్వయంచాలకంగా కనెక్ట్ అయినప్పుడు స్పేస్ డాకింగ్ జరుగుతుంది. ఇది భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు కీలకం. ఈ మిషన్ భారతదేశ అంతరిక్ష సామర్థ్యాలలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. భవిష్యత్తులో మరింత సంక్లిష్టమైన, ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయత్నాలకు ఇస్రోను నిలబెట్టింది. స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో స్పాడెక్స్ భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా నిలబెడుతుంది. అంతరిక్షంలో పెద్ద నిర్మాణాలను అసెంబ్లింగ్ చేయాల్సిన భవిష్యత్ స్పేస్ మిషన్‌లకు ఇది చాలా అవసరం. ఇందులో స్పేస్ స్టేషన్‌లను నిర్మించడం లేదా భారీ పేలోడ్ మిషన్‌లను నిర్వహించడం వంటివి ఉంటాయి. చంద్రుని అన్వేషణ, అంతరిక్ష కేంద్రాల నిర్వహణ వంటి రాబోయే అంతరిక్ష యాత్రలకు స్పేస్ డాకింగ్ ఒక కీలకమైన అవసరం.

ఈ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఇస్రో అటానమస్ డాకింగ్‌కు పునాది వేస్తోంది. చంద్రయాన్ 4 వంటి భవిష్యత్ మిషన్లకు ఇది కీలకమైన సామర్ధ్యం. గగన్ యాన్ మిషన్, చంద్రుడిపైకి భారతీయ వ్యోమగామిని పంపడం, భారత్ అంతరిక్ష స్పేస్ స్టేషన్ ఏర్పాటు వంటి భారతదేశ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష లక్ష్యాలకు మద్దతు ఇవ్వడంలో స్పాడెక్స్ మిషన్ కీలకపాత్ర పోషిస్తుంది. చంద్ర యాత్రలను చేపట్టడం, అక్కడి నుండి నమూనాలను తిరిగి తీసుకురావడం, ఇండియన్ స్పేస్ స్టేషన్ (బిఎఎస్)ను అభివృద్ధి చేయడం వంటి భారతదేశం భవిష్యత్తు ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రణాళికలకు ఈ మిషన్ కీలకం. రెండు చిన్న వ్యోమనౌకలను ఉపయోగించి వాటిని సమీకరించడం, డాకింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం, ప్రదర్శించడం. డాక్ చేయబడ్డ స్థితిలో కంట్రోల్‌ని డిస్ ప్లే చేయడం. టార్గెట్ చేయబడ్డ స్పేస్ క్రాఫ్ట్ జీవిత కాలాన్ని పొడిగించే సామర్ధ్యాన్ని ప్రదర్శించడం. డాక్ చేసిన వ్యోమనౌకల మధ్య విద్యుత్ శక్తి బదిలీని పరీక్షించడం లాంటి లక్ష్యాలను కలిగి ఉంది.

స్పాడెక్స్ అనేది పిఎస్‌ఎల్‌వి ప్రయోగం ద్వారా ప్రయోగించిన రెండు చిన్న వ్యోమనౌకల అంతరిక్షంలో డాకింగ్‌ను ప్రదర్శించడానికి రూపొందించిన తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతిక ప్రదర్శన మిషన్. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్‌ఎల్‌వి) -సి60 (స్పేస్ డాకింగ్ ఎక్స్‌పీరిమెంట్) స్పాడెక్స్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 2024 డిసెంబర్ 30న ఇస్రో ప్రయోగించింది. వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించడంతో మిషన్ ప్రారంభమైంది. ఉపగ్రహ సేవలు, అంతరిక్ష కేంద్రం కార్యకలాపాలు, గ్రహాంతర అన్వేషణ వంటి కీలకమైన సామర్థ్యం ఉన్న వ్యోమనౌకలు లేదా ఉపగ్రహాలను డాకింగ్, అన్‌డాకింగ్ చేయడంలో భారతదేశం సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించడం ఈ అపూర్వ మిషన్ లక్ష్యం. డాకింగ్ ప్రక్రియను అత్యంత కచ్చితత్వంతో నిర్వహించారు. ఈ వ్యోమనౌక 15 మీటర్ల దూరం నుంచి 3 మీటర్ల దూరం వరకు నిరంతరాయంగా కలిసి కచ్చితత్వంతో డాకింగ్ ప్రారంభించి స్పేస్ క్రాఫ్ట్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టింది.

దీని తరువాత ఉపసంహరణ సజావుగా పూర్తయింది. తరువాత స్థిరత్వం కోసం దృఢత్వం జరిగింది. డాకింగ్ అనంతరం రెండు ఉపగ్రహాలను ఒకే వస్తువుగా సమీకృత నియంత్రణను విజయవంతంగా సాధించి భారత సాంకేతిక నైపుణ్యాన్ని చాటింది. రానున్న రోజుల్లో ఈ వ్యవస్థను మరింత పరీక్షించడానికి శాటిలైట్ సెపరేషన్ క్యాంపెయిన్, పవర్ ట్రాన్స్‌ఫర్ పరీక్షలను నిర్వహించనున్నారు. స్పాడెక్స్ ఉపగ్రహాలలో ఒకటి 15 మీటర్ల వద్ద స్థానాన్ని కలిగి ఉంది.

స్పాడెక్స్ మిషన్‌లో రెండు చిన్నఉపగ్రహాలు ఉన్నాయి. అవి ఒకటి సిడిఎక్స్ 01. ఇది ఛేజర్. రెండు ఎస్‌డిఎక్స్ 02 ఇది లక్ష్యం. ఒక్కొక్కటి 220 కిలోల బరువు ఉంటాయి. ఏదైనా వ్యోమనౌక డాకింగ్ సమయంలో ఛేజర్లుగా (క్రియాశీల వ్యోమనౌక) పనిచేయగలదు. సోలార్ ప్యానెల్స్, లిథియం అయాన్ బ్యాటరీలు, పటిష్ఠమైన పవర్ మేనేజ్‌మెంట్ సిస్టం ఉన్నాయి. యాటిట్యూడ్ అండ్ ఆర్బిట్ కంట్రోల్ సిస్టమ్ (ఎఒసిఎస్)లో స్టార్ సెన్సర్లు, సన్ సెన్సార్లు, మాగ్నెటోమీటర్లు, రియాక్షన్ వీల్స్, మాగ్నెటిక్ టార్కర్లు, థ్రస్టర్లు వంటి యాక్చువేటర్లు ఉంటాయి. ఉపగ్రహ కక్ష్యలో డాకింగ్ ప్రక్రియను ప్రదర్శించడానికి అనేక సంక్లిష్ట ప్రక్రియలు ఉన్నాయి. డాకింగ్ తర్వాత రెండు ఉపగ్రహాలు ఒకే స్పేస్ క్రాఫ్ట్‌గా పనిచేస్తాయి. డాకింగ్ విజయాన్ని ధ్రువీకరించడానికి విద్యుత్ శక్తి ఒక ఉపగ్రహం నుండి మరొక ఉపగ్రహానికి బదిలీ చేయబడుతుంది.

విజయవంతంగా డాకింగ్, అన్ డాకింగ్ తర్వాత స్పేస్ క్రాఫ్ట్‌ను వేరు చేసి అప్లికేషన్ మిషన్‌లకు ఉపయోగిస్తారు. అన్ డాకింగ్ సమయంలో వ్యోమనౌకను వేరు చేయడం ద్వారా వారి ప్రైవేట్ పేలోడ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ పేలోడ్లు అధిక రిజల్యూషన్ చిత్రాలు, సహజ వనరుల పర్యవేక్షణ, వృక్ష అధ్యయనాలు, కక్ష్య రేడియేషన్ పర్యావరణ కొలతలను అందిస్తాయి. డాకింగ్ మెకానిజం, నాలుగు కెమెరాలు, డాకింగ్ సెన్సార్లతో కూడిన సెట్. పవర్ ట్రాన్స్‌ఫర్ టెక్నాలజీ, స్వదేశీ స్వయంప్రతిపత్తితో డాకింగ్ సాంకేతికత, స్పేస్ క్రాఫ్ట్‌ల మధ్య స్వయంప్రతిపత్త కమ్యూనికేషన్ కోసం ఇంటర్ శాటిలైట్ కమ్యూనికేషన్ లింక్ (ఐఎస్‌ఎల్), ఇతర వ్యోమనౌకల స్థితిని తెలుసుకోవడానికి ఇన్‌బిల్ట్ ఇంటెలిజెన్స్‌తో జతచేయబడింది. ఇతర వ్యోమనౌకల సాపేక్ష స్థానం, వేగాన్ని నిర్ణయించడానికి జిఎన్‌ఎస్‌ఎస్ ఆధారిత రిలేటివ్ ఆర్బిట్ డెసిషన్ అండ్ ప్రొపరేషన్ (ఆర్‌ఓడిపి) ప్రాసెసర్ ఉంది. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ డిజైన్ వాలిడేషన్ టెస్టింగ్ రెండింటికీ సిమ్యులేషన్ టెస్ట్ బెడ్స్ ఉన్నాయి.

జనక మోహన రావు దుంగ
8247045230

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News