Thursday, January 16, 2025

ఇస్రో మరో ఘనత .. అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన ఏడాది ప్రారంభం లోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగి లోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈమేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్టు ఇస్రో గురువారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. గత డిసెంబరు 30న తిరుపతి జిల్లా లోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ 60(పీఎస్‌ఎల్‌వీ)లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్ 1 బి , 15.12 నిమిషాలకు స్పేడెక్స్1 ఎ రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం మూడుసార్లు ప్రయత్నించగా, పలు కారణాల వల్ల ఇది వాయిదా పడింది. చివరకు గురువారం వీటి అనుసంధానం ప్రక్రియను చేపట్టారు.

ఈ క్రమం లోనే రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్‌ను మొదలు పెట్టారు. ఇది విజయవంతమైనట్టు ఇస్రో తమ పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీనికోసం శ్రమించిన సాంకేతిక బృందానికి యావత్ భారతీయులకు అభినందనలు తెలిపింది. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో ఈ తరహా సాంకేతికతలో భారత్ కూడా వాటి సరసన చేరింది.

ప్రధాని మోడీ హర్షం…

దీనిపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. “ అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక బృందానికి అభినందనలు. రాబోయే సంవత్సరాల్లో మనదేశ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగాలకు ఇది కీలక మెట్టుగా నిలిచింది ” అని ప్రధాని రాసుకొచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News