కుండపోత వర్షాలతో స్పెయిన్ లో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా మంగళవారం తూర్పు స్పానిష్ ప్రాంతం వాలెన్సియాలో వరదలు ముంచెత్తడంతో కనీసం 51 మంది మరణించారని స్థానిక అధికారులు బుధవారం వెల్లడించారు. రాత్రి సమయంలో వరదనీటిలో ప్రజలు చిక్కుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొందరు వరదల్లో కొట్టుకుపోకుండా ఉండటానికి చెట్లపైకి ఎక్కారు. కొన్ని ప్రాంతాల్లో కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు.
వాలెన్సియా ప్రాంతీయ నాయకుడు కార్లోస్ మజోన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు రోడ్డు ప్రయాణం చేయొద్దని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. టూరిస్, యుటియల్ వంటి కొన్ని ప్రాంతాలు 200 మిమీ (7.9 అంగుళాలు) వర్షపాతం నమోదయ్యాయి. కుండపోత వర్షాలతో స్పెయిన్ రాష్ట్ర వాతావరణ సంస్థ AEMET వాలెన్సియాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.