పల్లెటూళ్లలో పూర్వం నుంచి కనిపించే పిచ్చుకలు నేడు కనుమరుగవుతున్నాయి. అవి అంతరించిపోయే జీవజాతుల్లోకి చేరిపోయాయి. వ్యవసాయ రంగంలో రైతులకు నేస్తంగా ఉండే ఈ పిచ్చుక మన దేశ రాజధాని ఢిల్లీకి అధికార రాష్ట్ర పక్షి కూడా. తరచుగా పల్లెల్లో కనిపించే పిచ్చుకలను ‘ఊర పిచ్చుకలు’ అంటారు. దీని శాస్త్రీయ నామం పాసర్ డొమెస్టికస్. ఇవి గూడు నిర్మించే తీరును బట్టి పాతతరం ఇంజినీర్. మన ఇంటి ఆవరణలో అంటే ఆనాటి పెంకుటిల్లు, తాటాకు గుడిసె, గడ్డి ఇళ్లల్లో, పందిళ్లలో గూడు కట్టి తిరగాడేవి. నేటి ఆధునీకరణలో భాగంగా ఎక్కడో ఒక చోట అరుదుగా కనిపిస్తాయి. గూడు కట్టుకోవడంలో అన్ని పక్షులది ఒక రూటైతే గిజిగాడు రూటు సఫరేటు.
ప్రముఖ కవి గుర్రం జాషువా గిజిగాడిని తన పద్యాలలో కీర్తించిన నేపథ్యంలో పిచ్చుకలకు ’గిజిగాడు’ పేరు వచ్చింది. గిజిగాడు పక్షులు ప్రత్యేక నైపుణ్యంతో, ఇంజినీరింగ్ టెక్నాలజీతో ఈత తుమ్మ, తాటి చెట్ల కొమ్మల చివర ఒకే సైజు పొడవు ఉన్న గడ్డి పోచలను ముక్కున కరిచి తెచ్చుకుని అత్యంత వైపుణ్యంతో మగ పిచ్చుకలు గూడును నిర్మించి ఆడ పిచ్చుకలను ఆకర్షిస్తాయి. గూడు బాగుంటేనే ఆడ పక్షి మగ పక్షితో జత కడుతుంది. మిగతా పక్షులు పక్క నుంచో, పై నుంచో గూటిలోకి ప్రవేశిస్తే.. గిజిగాడు గూటికి వెళ్లే మార్గం మాత్రం అడుగు భాగం. గూడు లోపల వెచ్చగా ఉండటంతో పాటు వర్షానికీ తడవకపోవడం దీని ప్రత్యేకత. ఇవి గూళ్లను అందంగా, ఆకర్షణీయంగా నిర్మిస్తాయి.
ఇవి కూడా ప్రకృతిలో తమ పాత్రను పోషించి కీటకాలను అదుపులో ఉంచుతాయి. పిచ్చుకలు ఒంటరిగా కాకుండా జతలు జతలుగా ఉంటూ అన్యోన్యతను చాటుతాయి. చైనా దేశంలో 1958లో పిచ్చుకలు ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులు ఈ భూమ్మీద ఏ జీవి అనుభవించి ఉండదు. ఈ పర్యావరణ విపత్తు అసహజమైనది. పూర్తిస్థాయి మానవ తప్పిదమే.1958లో పక్షులు చైనాలో వేటాడబడినట్లుగా ప్రపంచంలో ఎక్కడా జరగలేదు.పిచ్చుకలను చంపేసిన ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం నజరానాలు ప్రకటించింది. కొంత మంది శాస్త్రవేత్తలు చనిపోయిన పిచ్చుకల జీర్ణ వ్యవస్థలోని పదార్థాలను పరిశీలించారు. దానిలో మూడోంతులు పంటలను నాశనం చేసే క్రిమికీటకాలు ఉండగా, ఒక వంతు మాత్రమే ధాన్యపు గింజలు ఉన్నట్లు కనుగొన్నారు. పిచ్చుకలు మానవులకు ఎంతో ఉపయోగం కలిగించే పక్షులని వారి పరిశోధనల ద్వారా నిర్ధారించారు. పిచ్చుకలను నాశనం చేసే ప్రయత్నాల వల్ల పంట దిగుబడి మరింతగా తగ్గింది.
పరిశోధన అనంతరం ప్రభుత్వం ఉద్యమాన్ని ఆపివేసింది. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. కొన్ని ఆధునిక పద్ధతుల వల్ల పిచ్చుకల సంఖ్య గణనీయంగా తగ్గింది. వ్యవసాయాధారిత బావులు లేకపోవడం, చెట్లను నరికి వేయడం, భవనాల సంఖ్య పెరగడంతో వాటికి గూళ్ళు నిర్మించుకునే అవకాశం లేదు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం వల్ల, సెల్‌ఫోన్ టవర్ల ద్వారా విడుదలయ్యే అధిక రేడియేషన్ వల్ల పిచ్చుకల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటికైనా కాలుష్యాన్ని నియంత్రిస్తూ సహజ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ అంతరిస్తున్న జంతు జాలాన్ని, పక్షిజాతులను కాపాడుకుంటేనే జీవవైవిధ్యానికి సార్థకత. అవసరాలను బట్టి మానవుని అత్యాశ పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ క్రమంలో భూగోళంపై పిచ్చుకలతో పాటు అనేక జీవజాతుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. జీవవైవిధ్యాన్ని సంరక్షించే నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వాలు ప్రత్యేక జంతు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.