దళితుడికి అత్యున్నత స్థానం
కేబినేట్‌లో ఇద్దరు దళితులకు చోటు
ఇద్దరు మహిళలకు స్థానం
సామాజిక సమతుల్యతను పాటించిన రేవంత్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ కొత్త స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎంపిక చేసింది. ఇటీవలి ఎన్నికల్లో వికారాబాద్ నుంచి గెలుపొందిన గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులతో కేబినేట్ లో పని చేసిన అనుభవం.. అణగారిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి.. ఇవి తెలంగాణ కొత్త స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ విశేషాలు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఈయన రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో జన్మించారు. ఇంటర్ చదివారు. 2008 ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో ఆయన మంత్రిగా పనిచేశారు. 2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుస ఓటములను చవిచూశారు. 2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఇక తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంచి అనుభవం ఉండడంతో కాంగ్రెస్ ఆయనకు స్పీకర్ బాధ్యతలు అప్పగించింది. దీంతో తెలంగాణలో కొత్తగా ఏర్పడిని కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు పెద్దపీట వేసినట్లు అయ్యింది. ఇప్పటికే ఇద్దరు మంత్రులుగా చేరారు.
భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహలు దళివర్గాలకు చెందిన వారు. స్పీకర్ కూడా దళితులకు కేటాయించడంతో ఈ ప్రభుత్వంలో దళితులకు పెద్దపీట దక్కింది. ఇకపోతే కోయజాతికి చెందిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్కను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవడం విశేషం. సిఎం రేవంత్ రెడ్డితో సహా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు స్థానం దక్కింది. బిసిల్లో పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలకు స్థానం దక్కింది. బ్రాహ్మణ వర్గం నుంచి శ్రీధర్ బాబుకు అవకాశం ఇచ్చారు. వెలమనుంచి జూపల్లి కృష్ణారావుకు, కమ్మ సామాజికవర్గం నుంచి తుమమలకు అవకాశం వచ్చింది. అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం నుంచి ముగ్గురికి ప్రాతినిధ్యం దక్కింది. ఆదిలాబాద్, నిజామాబాద్‌ల నుంచి ప్రాతినిధ్యం కల్పించలేదు. ఇద్దరు మహిళలకు చోటరావడం విశేషం.