హైదరాబాద్: అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఓడిపోయిన వారికి మద్దతుగా నిలుస్తున్నారని, ఇదేనా ప్రజాపాలన అంటే కాంగ్రెస్ చెప్పాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు. బిఆర్ఎస్ ఎంఎల్ఎలు శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిశారు. ఈ సందర్భంగా సబితా మాట్లాడారు. ప్రొటోకాల్ విషయంలో ఉల్లంఘనలను స్పీకర్ గడ్డ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గత ఆరు నెలల నుంచి ప్రతి నియోజకవర్గంలో ఓడిపోయిన ఎంఎల్‌ఎలకు అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఓడిపోయిన అభ్యర్థులు పాల్గొనడం ఏంటని ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఎంఎల్‌ఎల హక్కులను కాపాడాలని స్పీకర్‌ను కోరామని, ఎంఎల్‌ఎలకు ఉన్న హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను ప్రత్యేక అతిథులగా పిలుచుకొని ప్రభుత్వ కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని లక్ష్మారెడ్డి తెలియజేశారు.