నేరుగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్
గంట వ్యవధిలో 60 కాల్స్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాధారణ ప్రజలు, పిల్లలు
సమస్యలను తమిళిసై దృష్టికి తీసుకెళ్లిన ప్రైవేటు టీచర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఫోన్ ఇన్ కార్యక్రమంలో సర్‌ప్రైజ్ చేశారు. ప్రతి సంవత్సరం ఓపెన్‌హౌస్‌ను గవర్నర్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఓపెన్‌హౌస్ నిర్వహించినప్పుడు సిఎం సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, సాధారణ ప్రజలు కూడా గవర్నర్‌ను కలిసే అవకాశం కల్పించేవారు. ప్రస్తుతం కోవిడ్ 19 నేపథ్యంలో ఈ జనవరి 01వ తేదీ నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్ నుంచి ఫోన్ ఇన్ ద్వారా ప్రజలతో మాట్లాడారు. ఉదయం 10 గంటలకు ఫోన్ ఇన్ ప్రారంభించగా నిరవధికంగా కాల్స్ వచ్చాయి. దాదాపు గంట వ్యవధిలో సుమారుగా 60 కాల్స్ వచ్చినట్టు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలతో గవర్నర్ మాట్లాడుతున్న సందర్భంలో ఊహించని విధంగా స్పీకర్ పోచారం గవర్నర్‌కు ఫోన్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. స్పీకర్ ఫోన్ చేయడంతో ఆశ్చర్యపోయిన గవర్నర్ పోచారానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు.
రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కాల్స్
ఫోన్ ఇన్ కార్యక్రమంలో భాగంగా అన్నిరంగాల ప్రముఖులు, సాధారణ ప్రజలు ప్రత్యేకించి పిల్లల నుంచి ఎక్కువ కాల్స్ వచ్చాయని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కేవలం రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా కాల్స్ వచ్చాయి. ఆయా కాల్స్‌ను బట్టి గవర్నర్ తమిళం, తెలుగు, ఇంగ్లీష్, హిందీలో వారితో మాట్లాడారు. కొందరు తమ సమస్యలను గవర్నర్స్‌కు విన్నవించుకున్నారు. ఇందులో ప్రైవేటు టీచర్స్, ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ వారి సమస్యలను గవర్నర్‌కు వినతి చేసినట్టుగా తెలిసింది. అయితే ఆ వినతులన్నీ రాతపూర్వకంగా రాజ్‌భవన్‌కు ఫిర్యాదులు పంపితే తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా గవర్నర్ వారికి హామినిచ్చారు.