హైదరాబాద్: ఎల్లుండి నుంచి తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాల నేపధ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో ఆదివారం శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో సిఎస్ సోమేష్ కుమార్, డిజిపి,సిపితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బాన్సువాడ నుండి టెలీ కాన్ఫరెన్స్ లో స్పీకర్ పోచారం మాట్లాడుతూ… ఈనెల 6వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ 8వ సెషన్ 3వసమావేశాలు, శాసనమండలి 18వ సెషన్ 3వ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన అధికారులు, సిబ్బంది అందరికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉన్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని కోరారు.
అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి గత సమావేశాలలో లాగానే ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలన్నారు. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలి. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగులో ఉన్న జవాబులను వెంటనే పంపించాలి. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ బాషలలో అందించాలని చెప్పారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రతి శాఖ తరుపున ఒక నోడల్ అధికారిని నియమించాలి. నియోజకవర్గాలలో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలన్నారు. స్థానిక శాసనసభ్యునికి ముందస్తుగా సమాచారం అందించాలి. ప్రోటోకాల్ ఉల్లంఘన చేయకుండా రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లాలకు ఆదేశాలు పంపాలని సూచించారు. శాసనసభ కమిటీలకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం తరపున అందించాలని సభాపతి తెలిపారు. కరోనా ప్రభావం తగ్గినప్పటికి ఎవరికైనా లక్షణాలు ఉంటే నిర్ధారణ చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలోఅసెంబ్లీ డిస్పెన్సరీ లో కరోనా టెస్టింగ్ కు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన సభ్యులకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని స్వీకర్ పోచారం అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ లోని నివాసం నుండి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అత్యంత సమర్ధవంతమైనదని తెలిపారు. లోపల సభ ప్రశాంతంగా జరగాలంటే బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలన్నారు. గతంలోని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని తెలిపారు. ఈసారి కూడా అదేవిధంగా జరిగే విదంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను గుత్తా కోరారు.