Tuesday, December 24, 2024

ఎంఎల్‌ఎల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

 పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, 10వ
షెడ్యూల్, అసెంబ్లీ ఐదేళ్ల గడువును దృష్టిలో
ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి హైకోర్టు
సిజె ధర్మాసనం కీలక తీర్పు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్‌లపై షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని.. ఆ అర్హత స్పీకర్‌కు ఉందని సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎంఎల్‌ఎల అనర్హతపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. కాగా, బిఆర్‌ఎస్ పార్టీపై గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా అదేశాలు ఇవ్వాలని కోరుతూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పాడి కౌశిక్‌రెడ్డి, కె.పి.వివేకానంద పిటిషన్ దాఖలు వేశారు.

వీటితో పాటు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ అనర్హత పిటిషన్లను స్వీకరించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 9న ఈ పిటిషన్లను విచారించిన సింగిల్ బెంచ్, నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ ఖరారు చేయాలని తీర్పు వెలువరించింది. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలనే వ్యాజ్యాలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వీ.నర్సింహాచార్యులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి శుక్రవారం తీర్పు వెలువరించింది.

అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు శుక్రవారం తీర్పు ప్రకటించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు సిజె ధర్మాసనం సూచించింది. స్పీకర్‌కు ఎలాంటి టైం బాండ్ లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, 10వ షెడ్యూల్, అసెంబ్లీ ఐదేళ్ల గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News