Friday, November 22, 2024

ముఖ్యమంత్రిగా కొనసాగేది నేనే: సిద్ధరామయ్య

- Advertisement -
- Advertisement -

కర్నాటకలో ముఖ్యమంత్రి పదవిలో నుంచి తన స్థానంలో వచ్చేవారి గురించి ఇతర మంత్రులు చేస్తున్న ప్రకటనలకు సిద్ధరామయ్య బుధవారం స్పందిస్తూ, ముఖ్యమంత్రిగా కొనసాగేది తానే అని స్పష్టం చేశారు. ‘సిఎం పదవి ఖాళీగా లేనప్పుడు ఆ ప్రశ్నే తలెత్తదు. నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని మా పార్టీ నేతలే చెబుతున్నారు’ అని సిద్ధరామయ్య అన్నారు, బెంగళూరులోని అరణ్య భవన్‌లో మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడుతూ, ‘తాను ముఖ్యమంత్రిగా కొనసాగడం గురించి సందేహం ఏమాత్రం లేదు’ అని చెప్పారు. వాల్మీకి గిరిజన మండలి (విటిబి) కుంభకోణం విషయమై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సాగిస్తున్న దర్యాప్తుల గురించి ముఖ్యమంత్రి స్పందిస్తూ, ‘ఈ కేసును సిట్ కూడా దర్యాప్తు చేసి, చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ విషయమై కోర్టు నిర్ణయిస్తుంది’ అని తెలిపారు. పూర్వపు బిజెపి ప్రభుత్వ హయాంలో సుమారు 21 కుంభకోణాలు జరిగాయి.

దర్యాప్తులు ప్రారంభించడానికి, తదుపరి చర్యలు సూచించడానికి రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి జి పరమేశ్వర్ సారథ్యంలో ఒక మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటైంది’ అని సిద్ధరామయ్య తెలియజేశారు. పూర్వపు బిజెపి ప్రభుత్వ హయాంలోని కుంభకోణాలకు సంబంధించి దర్యాప్తుల పురోగతిని సమీక్షించి, తదుపరి చర్య తీసుకునేందుకు హోమ్ శాఖ మంత్రి పరమేశ్వర్ సారథ్యంలో ఈ కమిటీ ఏర్పాటైనట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ‘మంత్రులు కృష్ణ బైరె గౌడ, ప్రియాంక్ ఖర్గే, సంతోష్ లాడ్, హెచ్‌కె పాటిల్ ఈ కమిటీ సభ్యులు. నివేదిక సమర్పణకు ఒకటి రెండు నెలల సమయంఇవ్వడమైంది. పిఎస్‌ఐ కుంభకోణం, 40 శాతం కమిషన్ కుంభకోణం, కొవిడ్19 కుంభకోణం, బిట్‌కాయిన్ కుంభకోణం కోసమే దర్యాప్తు కమిషన్లు ఏర్పాటయ్యాయి. వాటిలో కొవిడ్19 దర్యాప్తు కమిషన్ ప్రాథమిక నివేదిక సమర్పించింది. దానిని సమీక్షించిన మీదట మంత్రివర్గం తదుపరి నిర్ణయం తీసుకుంటుంది’ అని సిద్ధరామయ్య తెలియజేశారు. దర్యాప్తులు ఆదేశించడం ద్వారా కర్నాటక ప్రభుత్వం ‘విద్వేష రాజకీయాలకు’ పాల్పడుతోందన్న బిజెపి ఆరోపణకు సిద్ధరామయ్య స్పందిస్తూ, ‘బిజెపి నాపై ‘విద్వేష రాజకీయాలు’ చేస్తోంది.

మా ప్రభుత్వం విద్వేష రాజకీయాలకు పాల్పడదు. కానీ తప్పులు చేసిన వారిపై తప్పకుండా చర్య తీసుకుంటుంది’ అని చెప్పారు. ఇది ఇలా ఉండగా, రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి జి పరమేశ్వర మద్దతుదారులు బుధవారం బెంగళూరులోని ఆయన నివాసం వద్ద ‘పరమేశ్వర, భావి సిఎం’ అంటూ నినాదాలు చేశారు. కాగా, ఉత్తర కర్నాటకకు చెందిన రాష్ట్ర పబ్లిక్ వర్క్ శాఖ మంత్రి సతీష్ జర్కిహోళి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినట్లయితే తాను సంతోషిస్తానని ఖానాపూర్ బిజెపి ఎంఎల్‌ఎ విఠల్ సోమన్న హలగేకర్ బెళగావిలో చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, బిజెపి ఎంఎల్‌ఎ జగదీశ్ షెట్టార్ హుబ్బళ్లిలో మాట్లాడుతూ, ‘కాంగ్రెస్‌లో అంతర్గత పోరు మరింతగా ఉంది. అది ఇప్పుడు బహిర్గతమైంది. వారి అంతర్గత పోరు కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి దారి తీస్తుంది. ముడా కుంభకోణం తరువాత ఈ పోరు తీవ్రరూపం దాల్చింది. సిఎం కావడానికి పలువురు సిద్ధం అవుతున్నారు’ అని చెప్పారు. కాగా, ‘సిఎం సిద్ధరామయ్య స్థానంలో ఎవ్వరినైనా నియమించడం అసాధ్యం’ అని కర్నాకట విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News