అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిఎంకె ప్రభుత్వం
చెన్నై: శనివారం తమిళనాడు అసెంబ్లీలో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను డిఎంకె ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.34,220.65 కోట్లు కేటాయిస్తూ ఆ రాష్ట్ర వ్యవసాయమంత్రి ఎంఆర్‌కె పన్నీర్‌సెల్వం బడ్జెట్ ప్రవేశపెట్టారు. గ్రామాలను స్వయం పోషకం చేయడం కోసం వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడ్తామని డిఎంకె ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. తమిళనాడులో ఇదే మొదటి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ అన్నది గమనార్హం. రైతుల ఆకాంక్షలమేరకు ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించినట్టు డిఎంకె ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధుల్లో పశువుల సంరక్షణ, చేపల పెంపకం, పాల ఉత్పత్తి, అడవుల అభివృద్ధి, పట్టుపురుగుల పెంపకం,సాగునీరులాంటి వాటికి ఖర్చు చేయనున్నారు. విద్యుత్ రంగానికి ఇందులో రూ.4508.23 కోట్లను కేటాయించింది. తమిళనాడులోనూ రైతులకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు.