Friday, December 27, 2024

హజ్ యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు : మంత్రి కొప్పుల ఈశ్వర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హజ్ యాత్రకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సోమవారం హైదరాబాద్ లోని హజ్ హౌజ్ కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో హజ్ యాత్ర ఏర్పాట్లపై మంత్రి కొప్పుల సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎయిర్ పోర్టు, రవాణా, పోలీసు, జిహెచ్‌ఎంసి, రోడ్లు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం అన్ని వసతులు సమకూర్చినట్టు చెప్పారు. హజ్ హౌస్ లో అవసరమైన సౌకర్యాలను పూర్తి చేసినట్టు మంత్రి వివరించారు.హైదరాబాద్ నుంచి వివిద శాఖల సహకారంతో ప్రత్యేక విమాన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

యాత్రికుల వసతి, బస, విమానాల టికెట్ బుకింగ్, బోర్డింగ్ సౌకర్యాలను కల్పించడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ హజ్ హౌస్ లో పాసులు, సామాను స్క్రీనింగ్, సామాను చెక్ ఇన్, మెడికల్, టీకా వంటివి ఏర్పాటు చేశారని చెప్పారు. శంషాబాద్ జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక టెర్మినల్ సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు. యాత్రికుల కోసం డయాస్, సిట్టింగ్ ఏర్పాట్లు, బస్ పాయింట్లు దిగడం, సామాను స్క్రీనింగ్, చెక్ ఇన్ కౌంటర్లు, మొదలైనవి హజ్ హౌజ్ లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దాదాపు ఏడు వేల మంది హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్నారని తెలిపారు. జూన్ ఏడవ తేదీ నుంచి హజ్ చార్టర్ విమానాలు నడుపుతారని, యాత్రికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణా హజ్ యాత్రికుల కోసం విస్తారా ఎయిర్‌లైన్స్ హజ్ హౌజ్ కు రిపోర్టు చేస్తారని చెప్పారు. ఆన్‌లైన్ ఈ-బుకింగ్ సిస్టమ్, మాన్యువల్ బుకింగ్ సిస్టమ్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.

హజ్ కమిటి చైర్మన్ మొహమ్మద్ సలీం మాట్లాడుతూ ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేసి హజ్ యాత్రికులకు ఎలాంటి అసౌకర్య్రం కలుగకుండా చూడాలన్నారు. సెకండ్ వెయిటింగ్ లీస్ట్‌లో 828 నుండి 984 సీరియల్ నెంబర్ వరకు హజ్ యాత్రకు ఆమోదించబడ్డారని తెలిపారు. ఈ సమావేశంలో ఎంఎల్‌ఎ జాఫర్ హుస్సేన్, హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం, ప్రభుత్వ సలహా దారు ఎకె ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసిఉల్లాఖాన్, మైనార్టీ కార్పొరేషన్ ఉన్నతాధికారి షఫీ ఉల్లా, హజ్ కమిటి సభ్యులు సయ్యద్ నిజాముద్దీన్, కార్పోరేటర్ షేక్ హమీద్ పటేల్, సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హఖ్, జాఫర్ ఖాన్, ఇర్ఫాన్ షరీఫ్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News